టైర్‌ పేలి స్కూటర్‌ పల్టీ

female techie dies in road accident - Sakshi

బనశంకరి: స్కూటర్‌ టైర్‌ పేలిపోయి డివైడరును ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా టెక్కీ మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కెంగేరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. డీసీపీ సుమన్‌ పన్నేకర్‌ తెలిపిన ప్రకారం వివరాలు... మండ్యకు చెందిన సులోచన (24) పద్మనాభనగర ఇట్టిమడులో నివాసం ఉంటూ కోరమంగలలో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె స్నేహితుడు అనంద్‌కుమార్‌ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తుంటాడు. సాయంత్రం 5.30 సమయంలో కోరమంగల నుంచి హోసకెరెహళ్లికి స్కూటర్‌లో సులోచన, అనంద్‌కుమార్‌  బయలుదేరారు. ఆనంద్‌కుమార్‌ ఫుల్‌ హెల్మెట్‌ ధరించగా, సులోచనా హాఫ్‌ హెల్మెట్‌ పెట్టుకుంది. నైస్‌ రోడ్డులో వెళుతుండగా స్కూటర్‌ టైర్‌ పేలిపోవడంతో అదుపుతప్పి  రోడ్డు పక్కన ఇనుప రైలింగ్‌ను ఢీకొన్నారు.  

హాఫ్‌ హెల్మెట్‌ వల్ల అధిక గాయాలు  
ఈ ప్రమాదంలో ఇద్దరికి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు తగిలాయి. తీవ్ర రక్తస్రావమై స్పృహ కో­ల్పోయి పడి ఉండగా ఇతర వాహనదారులు అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి పంపించారు. సులోచనా తల, మెదడు భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం ఉదయం కన్నుమూసింది. హాఫ్‌ హెల్మెట్‌ వల్ల ఆమె తలకు ఎక్కువ గాయాలు తగిలి మరణానికి దారితీసింది. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.  మరో బాధితుడు ఆనంద్‌ కుమార్‌ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సులోచనా మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. కెంగేరి ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top