హొసపేటె: కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక దివాళాను ఖండిస్తూ నగరంలో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. బీజేపీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా వచ్చిన బీజేపీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, వినతిపత్రాన్ని సమర్పించారు. పార్టీ నేత శంకర్ మేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసిందన్నారు. అభివృద్ధి పనులకు డబ్బు లేదన్నారు. ప్రభుత్వం తనంతట తానుగా ప్రకటించుకున్న ఐదు హామీలు ఇస్తూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తోందన్నారు. గృహలక్ష్మి డబ్బు రాలేదు. ముఖ్యమంత్రి కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. కరువును పరిశీలించడానికి హెలికాప్టరులో వచ్చిన ముఖ్యమంత్రి కరువును అధిగమించడానికి రైతులకు ఎలాంటి డబ్బులను ఇవ్వలేదన్నారు. నాయకులు నటరాజ్, సూగూరు చిదానంద, మారెప్ప, తిరుమలేశ, మహేష్, హొన్నూరప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎకరాకు రూ.50 వేల
పరిహారం ఇవ్వాలి
హుబ్లీ: కరువు కోరల్లో చిక్కి తీరని వ్యధకు గురవుతున్న రైతులకు కనీసం ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని నవలగుంద తాలూకా బీజేపీ అధ్యక్షుడు గంగప్ప డిమాండ్ చేశారు. ఈమేరకు ఓ ప్రకటనలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2500 ఇన్‌పుట్ సబ్సిడీ చాలా తక్కువ అని, ఇది రైతుల కంటి తడుపు చర్య అని ఆరోపించారు. పంట నష్టంతో రైతులు సాగు చేసిన విత్తనాలు, ఎరువులు, మందులు తదితర ఖర్చులకు గాను పరిహారం మొత్తాన్ని నిర్ణయించే ముందు సాగు కోసం ఖర్చు చేసిన వ్యయాన్ని సమగ్రంగా పరిగణించాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారిక వైబ్‌సైట్లలో రైతుల మొబైల్ ద్వారా దాఖలాల వివరాలను నమోదు చేయాలని సూచించడం కూడా రైతన్నలకు తీవ్ర ఇబ్బంది కలిగించిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం వచ్చే వారంలో రైతులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఉపాధ్యాయులు
నిజాయితీగా పని చేయాలి
రాయచూరు రూరల్ : సమాజంలో ఉపాధ్యాయులు ప్రామాణికతతో విధులు నిర్వహి ంచాలని కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, విధాన పరిషత్ సభ్యులు బోసురాజు, శశీల్ నమోషి పేర్కొన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో రుస్మా పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. ఉపాధ్యాయులు నిష్ట, ప్రామాణికత, దక్షతతో విధులు నిర్వహించాలన్నారు. కేశవరెడ్డి, వెంకటేష్, శేఖర్, శివ శంకర్, హైఫరోజ్, నాగిరెడ్డిలున్నారు.
సీఈసీని డిస్మిస్ చేయాలి
రాయచూరు రూరల్: దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ దారి తప్పిస్తోందని, సర్ వెనుక ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సర్ వ్యతిరేక పోరాట సమితి సంచాలకుడు శరణ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్, వివేక్ జోషి కలిసి సర్‌ను ఏవిధంగా అమలు చేయాలనే అంశంపై చర్చించి ఓటర్లను దారి తప్పించే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. దేశంలో 12 కోట్ల మంది పేర్లు జాబితాల నుంచి తొలగి పోతుండడంపై కోర్టు మెట్లెక్కాలన్నారు.
ఆరోగ్య రంగంలో
ఫార్మసిస్టుల పాత్ర కీలకం
రాయచూరు రూరల్: విద్యార్థులు వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర అమోఘమని రాయచూరు జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ కిశోర్ పిలుపు ఇచ్చారు. నవోదయ ఫార్మసీ కళాశాలలో జరిగిన ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఫార్మసిస్టులు త్వరిత గతిన ఫలితాలు పొందాలనే ఆశ ఉన్నా దానికి తగ్గట్టుగా విద్య నభ్యసించాలన్నారు. నవోదయ వైద్య కళాశాల చేస్తున్న సేవలు అనన్యమన్నారు. విశేష సేవలు అందించిన ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్, ప్రదీప్ కుమార్‌లకు ఉత్తమ ఫార్మసిస్టు అవార్డులను అందించారు. నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దొడ్డయ్య, బసవరాజ్, హాజీ మలంగ్, శివరాజ్ గౌడ, చంద్రమౌళి, సురేష్ బాబు, దీపాలిలున్నారు.


