ప్రైవేటు బస్సు బోల్తా, 20 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు బోల్తా, 20 మందికి గాయాలు

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

దొడ్డబళ్లాపురం: ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడ్డ ప్రమాదంలో 20మందికి పైగా ప్రయాణికులు గాయపడిన సంఘటన హావేరి జిల్లా బ్యాడగి తాలూకా మోటెబెన్నూరు వద్ద 48వ జాతీయ రహదారిలో జరిగింది. బెంగళూరు నుంచి పూణె వెళ్తున్న ప్రైవేటు బస్సు గురువారం వేకువన మోటెబెన్నూరు వద్ద బోల్తాకొట్టింది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు రక్షించారు. గాయపడినవారిని హావేరి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

కేపీఎస్‌సీ స్కాంలో ఈడీ వ్యూహం

● సౌధ ఠాణాలో ఫిర్యాదు

బనశంకరి: కేపీఎస్‌సీ ఉద్యోగాల నియామక కుంభకోణంలో ఈడీ అధికారులు విధానసౌధ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈడీ అక్రమ నగదు బదిలీ, మనీ లాండరింగ్‌ (పీఎంఎల్‌ఏ యాక్ట్‌) ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదును తీసుకుని, ఏం చేయాలనేదానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ ఆఫీసుకు పంపి సలహా తీసుకోవాలని నిర్ణయించారు. కేపీఎస్‌సీ పశు వైద్యాధికారుల ఉద్యోగాల స్కాంలో ఈడీ చురుగ్గా దర్యాప్తు చేయడం, పలువురు నిందితుల ఆస్తులను జప్తు చేయడం తెలిసిందే. తన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యాక ఈడీ కొందరు ముఖ్యమైన వ్యక్తులపై గురి పెడుతుందనే ప్రచారం సాగుతోంది.

కానిస్టేబుల్‌కు ఐదేళ్ల జైలు

దొడ్డబళ్లాపురం: లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడిన పోలీస్‌ కానిస్టేబుల్‌ నేరం రుజువు కావడంతో కలబుర్గి కోర్టు అతడికి 5 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బ్రహ్మపుర పోలీస్‌ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే భీమానాయక్‌ నిందితుడు. 2022లో ఒక స్థలం గొడవలో బాధితులను రూ.60వేలు లంచం డిమాండు చేశాడు. దీంతో బాధితులు లోకాయుక్త అధికారులను ఆశ్రయించారు. ముందస్తుగా రూ.30 వేలు లంచం తీసుకుటుండగా రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. అప్పటి నుంచి కేసు విచారణ సాగుతోంది. గురువారం విచారణలో నేరం నిరూపణ కావడంతో జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

ఏటీఎంలోకి నకిలీ నోట్ల జమ

● మోసగాళ్లకు సంకెళ్లు

దొడ్డబళ్లాపురం: ఏటీఎం మెషిన్‌లో నకిలీ కరెన్సీ జమ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు కేటుగాళ్లను హావేరి జిల్లా రాణిబెన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. అదే తాలూకా మేడ్లేరి గ్రామానికి చెందిన సురేశ్‌ బిళ్లాల్‌, మాలతేశ్‌ నిందితులు. వారి నుంచి పోలీసులు రూ.50 వేల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు స్థానిక ఏటీఎంలో తమ ఖాతాల్లోకి 77 నకిలీ రూ.500 నోట్లు జమ చేసి, తరువాత అసలు నోట్లను డ్రా చేయవచ్చని పథకం వేశారు. అయితే ఏటీఎం వాటిని నకిలీ నోట్లుగా గుర్తించి జమ చేసుకోకుండా తిరస్కరించింది. ఈ విషయం బ్యాంకుకు సమాచారం అందడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

లంచగొండి ఆర్‌ఐ అరెస్టు

మైసూరు: ఓ వ్యక్తికి చెందిన భూమి ఖాతా చేయడానికి రూ. 20 వేల లంచం తీసుకుంటున్న జిల్లాలోని సారగురు తాలూకా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ముజీబ్‌ రెహ్మాన్‌ లోకాయుక్తకు చిక్కాడు. సాగరే గ్రామంలో ఫలానా సర్వే నంబరులో 17 గుంటల భూమిని కుమార్‌కు ఖాతాను చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కుమార్‌, ఈ ఏడాది మార్చి 11న సారగురు తాలూకాఫీసులో దరఖాస్తు చేశాడు. నెల రోజులైనా పని కాకపోవడంతో, అతను కార్యాలయానికి వెళ్లి విచారించగా, ఆర్‌ఐ ముజీబ్‌ దరఖాస్తును నిలిపివేసి, ఖాతా కావాలంటే రూ. 25,000 లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో కుమార్‌ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైసూరులోని శ్రీరాంపూర్‌లో రింగ్‌ రోడ్డు దగ్గర కుమార్‌ నుంచి ఆర్‌ఐ రూ.20 వేల లంచం తీసుకుంటున్నాడు. అంతలో లోకాయుక్త అధికారులు దాడి చేసి, ఆర్‌ఐ ముజీబ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. లోకాయుక్త ఎస్పీ ఉదేశ్‌ ఆదేశంతో ఇన్‌స్పెక్టర్లు గిరీష్‌, స్వర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement