మైసూరు: ఆశా కార్యకర్తల డిమాండ్లను నెరవేరుస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వలేకపోతున్నామని, ముఖ్యమంత్రినే వారు నమ్మకపోతే ఎలాగని సీఎం డీకే శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం మైసూరులోని విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేరు. ఒకవేళ ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసి, భయపెట్టాలని వారు అనుకుంటే, అది జరగదు. నేను ఏదీ లిఖితపూర్వకంగా ఇవ్వలేను. నేను ఎవరికి రాసివ్వాలి? ఆశాలను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వారు కేంద్రాన్ని లిఖితపూర్వకంగా అడిగారా?’ అని సీఎం ప్రశ్నించారు. ఒకరికి రాసిస్తే, మిగతావారూ రాసివ్వాలని అడగడం మొదలుపెడతారన్నారు. ఇదే పరిస్థితి మరో 17 శాఖలలో కూడా ఉంది, వారూ రాసిమ్మంటే మేమేం ఏం చేయాలి? అని మండిపడ్డారు. ప్రపంచం నమ్మకం మీద నడుస్తుంది, ప్రభుత్వానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఆశా తల్లులు నాపై నమ్మకం ఉంచాలి అని ఆయన కోరారు. కేబినెట్‌లో చర్చించి నిర్ణయిస్తాం, నిరసనను విరమించి విధులకు వెళ్లండి అని విన్నవించారు.
ఊరట కలిగిస్తాం: సీఎం
శివాజీనగర: అంతకుముందు సీఎం బెంగళూరులో మాట్లాడుతూ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తప్పకుండా ఊరట కల్పిస్తామన్నారు. గౌరవ వేతనాన్ని కేంద్రం పెంచకపోతే, తామే దశలవారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. బీజేపీ నాయకులు కేంద్రానికి వెళ్లి ఎందుకు నిధులు అడగడం లేదని విమర్శించారు.
ఏనుగులను పంపవద్దని చెప్పా
చిక్కమగళూరు, హాసన్ జిల్లాల ఏనుగుల సమస్య, ఎమ్మెల్యేల రాజీనామా హెచ్చరికపై సీఎం స్పందిస్తూ, ఏనుగులను అంత తేలికగా నియంత్రించలేమన్నారు. ఏనుగులు మా ఇంటి తోటలోకి, ఐఏఎస్ అధికారుల తోటలోకి కూడా ప్రవేశించాయన్నారు. చిక్కమగళూరు ఎమ్మెల్యేలు అడగడంలో తప్పేమీ లేదన్నారు. రెండు ప్రాంతాల ప్రజలను రక్షించాలి, చిక్కమగళూరు వైపు ఏనుగులను పంపవద్దని నేను తక్షణమే ఆదేశించానని తెలిపారు. అందరితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానన్నారు.
ప్రభుత్వాన్నే బెదిరిస్తారా?
సీఎం డీకే శివ ఆగ్రహం
డిమాండ్ల పరిష్కారానికి హామీ
ఆశాలు లేకున్నా ఇబ్బంది లేదు
ఆరోగ్యమంత్రి ఖాదర్
శివాజీనగర: ఆశా కార్యకర్తలపై ఆరోగ్య మంత్రి యూ.టీ.ఖాదర్ గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలు లేకుండా కూడా ఆరోగ్య శాఖ పనిచేయగలదు, గత కొన్నిరోజులుగా ఆశాలు లేకపోయినా గ్రామాల్లో వైద్యసేవలు ఏవీ నిలిచిపోలేదు అని చెప్పారు. ఎక్కడైనా సమస్య ఉందా, అస్సలు లేదు. ఆశా కార్యకర్తలు లేకుండా కూడా ఆరోగ్య శాఖ పనిచేస్తోందని వారే స్వయంగా నిరూపించారన్నారు. ప్రసవాలు యథావిధిగా జరుగుతున్నాయన్నారు. తమిళనాడులో ఆశా కార్యకర్తలు లేకున్నా అక్కడ తల్లీ బిడ్డల మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పారు. ఆశాలకే కాదు చాలామంది ఉద్యోగులకు రూ.10 వేలే వేతనం చెల్లిస్తున్నాం, ఆశాలకు ఎందుకు రూ.15 వేలు చెల్లించాలని అని మంత్రి ప్రశ్నించారు. మరోవైపు బెంగళూరు స్వతంత్ర పార్కులో ఆశాల ఆందోళన కొనసాగింది. పలువురు అస్వస్థతకు గురికావడంతో వైద్యసిబ్బంది చికిత్స చేశారు.


