వాల్మీకి మండలి కేసులో నాగేంద్రకు సీఐడీ క్లీన్‌చిట్‌ | - | Sakshi
Sakshi News home page

వాల్మీకి మండలి కేసులో నాగేంద్రకు సీఐడీ క్లీన్‌చిట్‌

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కుదుపులు సృష్టించిన మహర్షి వాల్మీకి గిరిజన అభివృద్ధి కార్పొరేషన్‌లో రూ.180 కోట్ల నిధుల కుంభకోణంలో మాజీ మంత్రి, బళ్లారి రూరల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీ.నాగేంద్రకు సీఐడీ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. లోకాయుక్త ప్రత్యేక కోర్టుకు సీఐడీ సమర్పించిన తుది చార్జిషీట్‌లో ఆయనతో పాటు కార్పొరేషన్‌ అధ్యక్షుడు బసవరాజ్‌ దద్దల్‌లను నిందితులుగా కాకుండా సాక్షులుగా పేర్కొంది. ఆ సంస్థ మాజీ ఎండీ పరుశురామ్‌, నెక్కంటి నాగరాజ్‌, సత్యనారాయణ వర్మలను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. దబ్బు పెట్టుబడి పెడితే రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసిన నెక్కంటి నాగరాజ్‌, పరశురామ్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకుని కార్పొరేషన్‌ డబ్బును అక్రమంగా బదిలీ చేశాడని, ఈ లావాదేవీలు అప్పటి మంత్రి నాగేంద్ర దృష్టికి రాలేదని సీఐడీ పేర్కొంది. ఈ స్కాం ఆరోపణలతో నాగేంద్ర 2024 జూన్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ప్లాట్ల స్వాహా.. పీడీఓ సస్పెండు

బాగేపల్లి: ఘంటం వారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లేఔట్‌లో ప్రైవేట్‌ వ్యక్తులకు అక్రమంగా ఈ–ప్రాపర్టీ కేటాయింపులు చేశారన్న కేసులో పీడీఓ భాగ్యలక్ష్మిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. బిల్ట్‌ లేఅవుట్‌లో 17 ప్లాట్లు ఉండగా, కొంత ఖాళీ స్థలాన్ని ప్రజాప్రయోజనాలకు వదిలారు. కానీ ఆ స్థలంలో కూడా అక్రమంగా 6 ప్లాట్లను సృష్టించి కొందరికి అమ్మేసినట్లు న్యాయవాది నాగభూషణం జడ్పీ సీఈఓ వై.నవీన్‌ భట్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నిర్ధారణ కావడంతో భాగ్యలక్ష్మిని తక్షణమే సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

యువతి చేతిలో బంధువు హత్య

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా కన్యాన గ్రామం శిరంకల్లు నందరకొండలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. చెన్నయ్య పూజారి (55)ని అన్న కూతురు హృతిక హత్య చేసినట్లు మృతుని కొడుకు సుమంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో కుటుంబ అంశంపై పూజారి, ఆమె మధ్య గొడవ తలెత్తింది. హృతిక కత్తి తీసుకుని పొడిచి చంపిందని తెలిపాడు. హృతికపై విట్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

దర్శన్‌ చికిత్సకు కోర్టు ఓకే

యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌ ఆరోగ్య పరిస్థితిపై గురువారం పరప్పన సెంట్రల్‌ జైలు వైద్యాధికారులు బెంగళూరు 59వ సీసీ హెచ్‌ కోర్టుకు నివేదికను అందించారు. తీవ్ర వెన్నునొప్పి బాధిస్తోందని దర్శన్‌ జడ్జికి గతంలో ఫిర్యాదు చేశాడు. సాయంత్రం తిరిగి విచారించిన జడ్జి.. దర్శన్‌కు బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. పిజియోథెరపీ అవసరమని ఆయన వకీలు తెలిపారు. చికిత్స కోసం జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు.

సిద్దు ఇంట నేతల భేటీ

శివాజీనగర: మాజీ సీఎం సిద్దరామయ్య మైసూరు నివాసంలో పలువురు మంత్రులు, మాజీ మంత్రులతో భేటీ జరిపారు. కొత్త ప్రభుత్వంలో మంత్రిపదవి దక్కక హెచ్‌.సీ,మహాదేవప్ప సిద్దుకు దూరంగా ఉండగా, ఈ భేటీలో పాల్గొని సఖ్యతను చాటారు. బుధవారం మంత్రులు జమీర్‌ అహమ్మద్‌ ఖాన్‌, యతీంద్ర కలిసి హెచ్‌.సీ,మహాదేవప్ప ఇంటికి వెళ్లి బుజ్జగించారు. సిద్దరామయ్యతో ఎప్పుడూ పోట్లాడలేదని మహాదేవప్ప చెప్పారు. వీరితో పాటు ఈ భేటీకి కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్‌, మంత్రి పుట్టరంగశెట్టి, మాజీ మంత్రి కే.వెంకటేష్‌, ఇతర నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, స్టింగ్‌ గొడవలు సహా పలు అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement