మైసూరు: ‘రాజ్యాంగం మనందరికీ న్యాయానికి ఆధారం, సమానత్వానికి నిధి, ప్రజాస్వామ్యానికి శక్తి వాహకం. ఇది మనందరికీ ఒక పవిత్ర గ్రంథం, దేశానికి ఒక ఆధ్యాత్మిక శక్తి’ అని ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అన్నారు. గురువారం మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ సభ అట్టహాసంగా నిర్వహించారు. సీఎం డీకే, మాజీ సీఎం సిద్దరామయ్య, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వేలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం డీకే ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ, పండిత జవహర్‌లాల్ నెహ్రూల మార్గదర్శకత్వంలో బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించి మనకు జీవించే హక్కును అందించారని పేర్కొన్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కు ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించడం మన కర్తవ్యం అని ఆయన అన్నారు.
తరలివచ్చిన నేతలు
ఈ సభలో మంత్రులు కేహెచ్ మునియప్ప, కేఎస్ బసవంతప్ప, నరేంద్రస్వామి, టి.రఘుమూర్తి, సతీష్ జార్కిహొళి, పుట్టరంగశెట్టి, రిజ్వాన్ హర్షద్, కేఎం శివలింగగౌడ, యూటీ ఖాదర్, ఎంపీలు సునీల్ బోస్, శ్రేయస్ పటేల్, ఏఐసీసీ నేత రణదీప్ సూర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైసూరు సిటీలో బృహత్ ర్యాలీ, శకటాలు, కళాబృందాల ప్రదర్శనల ఆర్భాటం మిన్నంటింది. వారంరోజులుగా ఏర్పాట్లు చేసి విజయంతం చేశారు.
పాఠశాలల్లో రాజ్యాంగ బోధన: సీఎం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు రాజ్యాంగ లక్ష్యాలు, విలువలు, హక్కులను పాఠ్యాంశాలుగా బోధించాలని నిర్ణయించినట్లు సీఎం డీకే తెలిపారు. రాజ్యాంగం ఒక చట్టాల పుస్తకం కాదు, అది భారతీయుల పవిత్ర గ్రంథం, దేశ ఆత్మ, ప్రజల హక్కులను పరిరక్షించే గొప్ప శక్తి అది అని వర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి పౌరుడు, విద్యార్థి రాజ్యాంగ పీఠికను, దాని ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవడం అత్యవసరమని అన్నారు. ఓట్ చోరీ ద్వారా బీసీలు, దళితులు, ముస్లింల ఓటు హక్కులను లాక్కోవడానికి ప్రయత్నం జరుగుతోందని సీఎం ఆరోపించారు.
ఏ యుద్ధానికైనా సిద్ధం: సిద్దు
సీఎం డీకే శివకుమార్
మైసూరులో అట్టహాసంగా
రాజ్యాంగ దినోత్సవ సభ
తరలివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు
బృహత్ ఊరేగింపు
‘రాజ్యాంగాన్ని కాపాడటానికి రెండో స్వాతంత్య్ర పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి’ అని అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. సభలో ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. సావర్కర్, హెగ్డేవార్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. రాజ్యాంగాన్ని మార్చడానికే మనం వచ్చామని ఒక కేంద్ర మంత్రి అన్నారు అని సిద్దు బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికత బీజేపీకి లేదన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తే రక్తపాతం జరుగుతుందని బీజేపీకి తెలుసు, సమాజాన్ని విభజించి ద్వేషాన్ని సృష్టించడమే బీజేపీ పని అని దుయ్యబట్టారు. దేశంలో అసమానత్వాన్ని నిర్మూలించాలి, అప్పుడే దేశంలో మార్పు వస్తుంది, అంతవరకు కులతత్వం తొలగిపోదు. ఆర్థిక, సామాజిక సమానత్వం రావాలి. అది లేకుండా స్వాతంత్య్రానికి అర్థం ఉండదు అని స్పష్టంచేశారు. కుల వ్యవస్థ తొలగిపోవాలని బసవన్న వాదించారు, కానీ, కుల వ్యవస్థ నేటికీ కొనసాగుతోందని వాపోయారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం ఇవే మన రాజ్యాంగానికి ఆత్మ అని, బడుగులకు కూడా హక్కులు, గౌరవం కోసం అంబేడ్కర్ దూరదృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు.


