యశవంతపుర: లారీని, ట్రాక్స్ తుఫాన్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదం ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర ఠాణా పరిధిలో అరబైలు ఘాట్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగింది. మృతులందరూ ధార్వాడకు చెందిన యువకులు.
వివరాలు.. హుబ్లీ–ధార్వాడలో డెలివరీ బాయ్స్‌గా పని చేసే యువకులు స్నేహితులుగా కలిసి మెలిసి ఉండేవారు. ఈ నేపథ్యంలో ధర్మస్థల, గోకర్ణ వంటి పుణ్యక్షేత్రాల దర్శనంతో పాటు టూరిస్టు స్పాట్లను చూడాలని నిర్ణయించుకున్నారు. ట్రాక్స్ తుఫాన్ వాహనాన్ని బాడుగకు తీసుకుని బుధవారం రాత్రి బయల్దేరారు. డ్రైవరుతో పాటు 9 మంది ఉన్నారు. కొన్నిగంటల పాటు ప్రయాణం సజావుగానే సాగింది.
నిద్రలోనే మృత్యు ఒడికి
ఉత్తర కన్నడ జిల్లాలో అరబైలు ఘాట్ రోడ్డులో బళగార్ వద్ద మలుపులో అదుపుతప్పిన తుఫాన్ వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. క్షణాల్లో జరిగిన ఈ దుర్ఘటనలో తుఫాన్‌లో ఉన్నవారు తీవ్ర గాయాల పాలై నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. వాహనం ముందుభాగం నుజ్జునుజ్జుయింది.
బసవరాజ్ (48), అభిషేక్ ఈశ్వర్ (28), అక్షయ్ (26), అభిషేక్ మల్లేష్ (26), డ్రైవర్ సంజయ్ అంగడి (33), సచిన్ (25), మంజునాథ్ చులకి (32) అనేవారు విగతజీవులయ్యారు. శివరాజ్ దుర్గప్ప మడివాళ్ (22) చన్నబసయ్య బసలింగయ్య(28) అనే ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ దారిన వెళ్తున్న ఇతర వాహనాల వారు చూసి డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. యల్లాపుర పోలీసులు చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను హుబ్లీ ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి అతివేగంతో పాటు డ్రైవరు నిద్రమత్తు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
అనాథను చేశావా కొడుకా..
టూర్‌కు వెళ్తున్నామని సంతోషంగా బయల్దేరిన పిల్లలు ఇక లేరని తెలిసి తల్లిదండ్రులు, బంధుమిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే యల్లాపురకు బయల్దేరారు. ఈరమ్మ అనే మహిళ విలపిస్తూ తన కుమారుడు 20 రోజుల క్రితమే దుబాయ్ నుంచి ధార్వాడకు వచ్చాడని, ఖర్చుల కోసం స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా చేరాడని తెలిపింది. స్నేహితులతో కలిసి ధర్మస్థల, చిక్కమగళూరు పర్యటనకు వెళ్తానని చెప్పి బయల్దేరాడని, తనను అనాథను చేశాడని రోదించింది.
లారీని ఢీకొన్న ట్రాక్స్ తుఫాన్
ధార్వాడకు చెందిన 7 మంది
యువకుల దుర్మరణం
ఉత్తర కన్నడ జిల్లాలో ఘటన
విహాయాత్రలో విషాదం
చివరి సెల్ఫీ
బుధవారం రాత్రి 10:30 గంటలకు అందరూ డెలివరీలను పూర్తి చేశారు. ధార్వాడ కెసిడి గణేశ్ ఆలయం వద్ద కలిసి సెల్ఫీ ఫోటోలు, వీడియోను తీసుకున్నారు. అదే చివరి జ్ఞాపకంగా మిగిలింది.


