న్యూస్‌రీల్
శివాజీనగర: బెంగళూరు మెట్రో రైళ్లకు ఎప్పుడు సమస్య వస్తుందో, ఎక్కడ ఆగిపోతాయో ఎవరూ ఊహించలేరు. గురువారం ఉదయం మంచి రద్దీ వేళలో మెట్రో గ్రీన్ లైన్‌లోని ఒక రైలు మొరాయించింది. ఎప్పటిలాగే తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఎక్కువగా పర్పుల్ లైన్‌లో ఇటువంటి సమస్యలు తలెత్తేవి. ఈ దఫా గ్రీన్ మార్గంలో ఏర్పడింది. పట్టాలపై ఓ రైలు ఆగిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే ఉదయం 08:23 గంటల నుంచి 8:45 గంటల వరకు మెట్రో సేవల్లో ఆటంకం నెలకొంది. 10:30 గంటల వరకూ కూడా గ్రీన్‌లో నత్తనడకన నడిచాయని ప్రయాణికులు ఆరోపించారు. ఉదయం 10–30 గంటల నుంచి ఈ సమస్యను పరిష్కరించినట్లు బీఎంఆర్‌సీఎల్ తెలిపింది. మెట్రో సేవలు సహజ స్థితికి చేరుకున్నాయని, ప్రయాణికులు చూపించిన సహనం, సహకారానికి కృతజ్ఞతలని తెలిపింది. ఇటీవల రాత్రి వేళ పర్పుల్ లైన్‌లో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు లారీలు, టిప్పర్లు ఎక్కి వెళ్లిపోవడం తెలిసిందే.
10 తులాల చైన్ స్నాచింగ్
కోలారు: ముళబాగిలు తాలూకా మల్లికుప్ప గ్రామంలో ఉదయం వాకింగ్ వెళ్లిన మహిళ మెడలోని 10 తులాల బంగారం మాంగల్యం గొలుసును వెనుక నుంచి బైక్‌లో వచ్చిన ఇద్దరు అపరిచితులు లాక్కుని పరారయ్యారు. మల్లికుప్ప గ్రామానికి చెందిన నీరజ రోజూ మాదిరిగానే బుధవారం పొద్దున నడకకు వెళ్లింది. గ్రామంలోని అశ్వర్థకట్ట సమీపంలో నడుస్తుండగా బైక్‌లో వెనుక నుంచి వేగంగా వచ్చిన దుండగులు లాక్కెళ్లారని విలపించింది. చైను 100 గ్రాముల బరువు ఉన్నట్లు తెలిపింది. నంగలి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
తహసీల్దార్‌తో బీఎల్‌ఓల రగడ
దొడ్డబళ్లాపురం: సర్ సమీక్ష గురించి తహసీల్దార్, పీడీఓల మధ్య వాగ్వాదం, తోపులాట బెళగావి జిల్లా ఖానాపురలో జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖానాపుర తహసీల్దార్ కార్యాలయంలో సర్ సమావేశం జరిపారు. కొందరు బీఎల్‌ఓలు సక్రమంగా పనిచేయడం లేదని తహసీల్దార్ దుండప్ప కుమార్ చెబుతుండగా పీడీఓలు ఆగ్రహం పట్టలేక వాగ్వాదానికి దిగారు. ఏకవచనంతో మాట్లాడుకుంటూ తహసీల్దార్, బీఎల్‌ఓలు తోసుకున్నారు. దీంతో బయటకు వచ్చిన పీడీఓలు తహసీల్దార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ పీడీఓలు ఎస్‌ఐఆర్ నిబంధనల మేరకు నడుచుకోవడం లేదని, దీనిపై గందరగోళం నెలకొందని చెప్పారు.
నంది హిల్స్ రోడ్డులో భల్లూకాలు
చిక్కబళ్లాపురం: నిత్యం పర్యాటకులతో నిండి ఉండే నంది హిల్స్ రోడ్డులో బుధవారం రాత్రి భల్లూకాలు వచ్చాయి. అక్కడి హోటళ్ల సీసీ కెమెరాలలో తల్లీ పిల్ల భల్లూకాలు కనిపించాయి. స్థానికులు ఫిర్యాదు చేయడంతో గురువారం చిక్క అటవీ అధికారులు పరిశీలించారు. ఈ భాగంలో ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయని, ఆహారం కోసం సాయంత్రం తరువాత కొండపై నుంచి కిందికు వస్తాయని, అవి ఎవరిని ఏమీ చేయవని, ప్రజలు కూడా వాటికి ఏమీ అపాయం తలపెట్టరాదని తెలిపారు. పిల్లలతో ఉన్న ఎలుగుబంట్ల జోలికి వెళ్తే ఎదురు తిరుగుతాయని హెచ్చరించారు. నగరం నుంచి నంది హిల్స్‌పైకి వెళ్లే రోడ్డులో వాహనదారులు నిదానంగా చూసుకొని పోవాలని తెలిపారు. ఎలుగుబంట్లు కనిపిస్తే వాటి జోలికి పోరాదని సూచించారు.


