ఇది ప్రజల ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఇది ప్రజల ప్రభుత్వం

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

శివాజీనగర: ‘ఇది ప్రజల ప్రభుత్వం. అధికారులు ప్రజలతో హుందాగా, జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పష్టంచేశారు. సీఎం అయిన తరువాత గురువారం తొలిసారిగా బెళగావికి వచ్చిన సీఎంను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి సాంబ్రా విమానాశ్రయంలో దిగారు. బయటకు రాగానే డీకే, డీకే అని జయధ్వానాలు చేస్తూ పూల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌, మంత్రులు ఎం.బీ.పాటిల్‌, సతీశ్‌ జార్కిహొళి, ఎమ్మెల్యేలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌, అశోక పట్టణ, బాబాసాహేబ పాటిల్‌, ఆసిఫ్‌ సేట్‌, విజయానంద కాశప్పనవర, మహేంద్ర తమ్మణ్ణవర, విశ్వాస వైద్య సహా పెద్దసంఖ్యలో నాయకులు తరలివచ్చారు. ఆ తరువాత పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు.

సువర్ణసౌధలో భేటీ

బసవ కల్యాణ నుంచి ఆరంభమైన పర్యటన బీదర్‌, కల్బుర్గిలో ముగించి, ఇప్పుడు బెళగావికి వచ్చాను అని అన్నారు. నేరుగా అసెంబ్లీ భవనం సువర్ణ విధానసౌధకు వెళ్లి మహాత్మాగాంధీ బృహత్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడ సెంట్రల్‌ హాల్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో జిల్లా ప్రగతి సమావేశం ఏర్పాటైంది. అతివృష్టి, అనావృష్టితో పాటు జిల్లా అంశాలను చర్చించారు. ఈ భాగం అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఎమ్మెల్యేలు కోరారు. రైతు నేతలు సీఎంను కలిసి డిమాండ్లు వినిపించారు.

ప్రజలను తిప్పించుకోవద్దు

సువర్ణసౌధ సమావేశంలో సీఎం డీకే అధికారులకు ముఖ్య సూచనలు చేశారు. ప్రజలతో అధికారులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ‘ప్రభుత్వం ప్రజలది’ ప్రభుత్వం ప్రజలతో ఉండాలన్నదే నా మొదటి ప్రాధాన్యత. కార్యాలయాలకు ప్రజల ప్రదక్షిణలు చేయడం నిలిచిపోవాలి. అన్ని శాఖల జిల్లా, తాలూకా స్థాయి అధికారులు పనిచేసే చోట ఉండాలి. వారి కదలికలను డీసీలు, సీఈఓలు గమనిస్తుండాలి’ అని ఆదేశించారు.

జిల్లా మంత్రి ప్రజలను కలవాలి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రతి నెలా మొదటి, మూడవ శనివారాల్లో తాలూకాలను సందర్శించి ప్రజలతో సమావేశమై సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ప్రతి దరఖాస్తు ఫార్మాట్‌ను ప్రజా సంబంధాల సమావేశంలో అందజేస్తామని అన్నారు. ప్రజల సమస్యలను చట్టపరమైన పరిధిలోనే పరిష్కరించాలని ఆయన తెలిపారు.

అత్యాధునిక విద్యాలయాలు

ప్రజలు తమ పిల్లల విద్య, ఉపాధి కోసం నగరాలకు వస్తుంటారు. దీనిని నివారించడానికి సీఎస్‌ఆర్‌ విధానం కింద అత్యాధునిక విద్యాలయాలను నిర్మిస్తామని తెలిపారు. ఈ విధంగా కనీసం 2000 పాఠశాలలను నిర్మించడమే లక్ష్యమని సీఎం చెప్పారు. అలాగే ప్రతి జిల్లాలోని పెద్ద విద్యాసంస్థలు మూడు పాఠశాలలను చొప్పున దత్తత తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించాలన్నదే మా ఆకాంక్ష అని తెలిపారు.

10 వేల భారత్‌ జోడో సంఘాలు

ప్రతి పంచాయతీలో భారత్‌ జోడో యువక సంఘాలను ఏర్పాటు చేసి రూ.10 లక్షల సాయం చేస్తామని సీఎం తెలిపారు. 10 వేల యువజన సంఘాలను ఏర్పరుస్తామన్నారు. ఇందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. ప్రతి తాలూకాలో ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జనం కోసం అధికారులు పనిచేయాలి

సీఎం డీకే శివకుమార్‌ ఆదేశం

బెళగావిలో పర్యటన

సువర్ణసౌధలో ప్రగతి సమావేశం

బెళగావిపై తగ్గేది లేదు

మహా సీఎం ఫడ్నవిస్‌ హూంకరింపులు

శివాజీనగర: కర్ణాటకలో అంతర్భాగమైన బెళగావి అంశాన్ని మరోసారి లేవనెత్తిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, బెళగావి సరిహద్దు వివాదంపై త్వరితగతిన విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని చెప్పారు. సీఎం డీకే శివకుమార్‌ బెళగావి పర్యటన నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం. కర్ణాటకలోని మరాఠీలకు న్యాయం చేస్తానని, జాతీయ భాషా అల్పసంఖ్యాకుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని దేవేంద్ర ప్రకటించారు. అలాగే కోర్టు వెలువల చర్చల ద్వారా దీనిని పరిష్కరించుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ముగ్గురు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరతానని కూడా ఆయన తెలిపారు. మహారాష్ట్రలో ముఖ్యమైన నాయకుల సమావేశంలో సీఎం ఫడ్నవిస్‌ మాట్లాడుతూ మహారాష్ట్ర చాలా కాలంగా పోరాడుతోంది, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న మరాఠీ ప్రజలకు యావత్‌ మహారాష్ట్ర ప్రజలు అండగా నిలుస్తారని ప్రకటించారు. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం 2004 నుంచి సుప్రీం కోర్టులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement