దొడ్డబళ్లాపురం: పెట్రోల్ ట్యాంకర్ చెట్టును ఢీకొని మంటల్లో కాలిపోయింది. దొడ్డబళ్లాపురం–నెలమంగల రహదారి మార్గంలోని మల్లోహళ్లి కాలనీ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం దొడ్డబళ్లాపురం మీదుగా నెలమంగల వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ రభసకు మంటలు చెలరేగాయి. ట్యాంకర్ లోపల సుమారు 10వేల లీటర్ల పెట్రోల్ ఉన్నట్టు సమాచారం. పెట్రోలు మంటలకు పక్కనే నిలిచి ఉన్న పాల ట్యాంకర్ కూడా అంటుకుని దగ్ధమైంది. ప్రమాదం కారణంగా రెండు వైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. పెద్దమొత్తంలో ఆస్తినష్టం సంభవించింది, ట్యాంకర్ డ్రైవరు, క్లీనర్ గాయాలతో బయటపడ్డారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


