దొడ్డబళ్లాపురం: నాటుబాంబు పేలి లాయర్ తీవ్రంగా గాయపడ్డ ఘటన హారోహళ్లి తాలూకా సుండగట్ట గ్రామంలో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన లాయర్ మోహన్‌కు సుండగట్ట గ్రామం వద్ద ఫాంహౌస్ ఉంది. గురువారం రాత్రి ఫాంహౌస్‌కి వెళ్లిన సమయంలో దుండగులు గేట్ వద్ద నాటుబాంబు ఉంచి వెళ్లారు. శుక్రవారం ఉదయం మోహన్ బయటకు వెళ్తూ నాటుబాంబుపై కాలు పెట్టడంతో పెద్ద శబ్దంతో పేలింది. పేలుడు తీవ్రతకు మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు ఆయనను బెంగళూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కోడిహళ్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
దర్శన్ కొడుకు వివాదం
యశవంతపుర: నటుడు దర్శన్ కొడుకు వినీశ్ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వినీశ్ ఇతరులతో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై దర్శన్ భార్య విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. చిన్న ఘటన జరిగింది నిజం. అయితే కారును వినీశ్ నడపలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారో లేదో కారు దిగి చూడగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. వినీత్ గాయపడి ఆస్పత్రిలో ఉన్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చింది. ఇది అబద్ధం. ప్రమాదానికి గురైనవారు కూడా తప్పు తమదేనని ఒప్పుకున్నారు. వినీశ్ సురక్షితంగా ఉన్నారు. వాహనాన్ని వినీశ్ నడపలేదని స్పష్టం చేశారు. తమ డ్రైవరే కారును నడిపినట్లు విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. బెంగళూరులోని ట్రాఫిక్‌కు ఇలాంటి చిన్న ఘటనలు సామాన్యమన్నారు.
త్రిబుల్ మర్డర్ కేసులో
కెన్నెత్ అరెస్ట్
బనశంకరి: కృష్ణరాజపురం పరిధిలో చోటు చేసుకున్న త్రిబుల్ మర్డర్ కేసులో కెన్నెత్‌ను గురువారం రాత్రి తమిళనాడు, బెంగళూరు పోలీసులు పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. ప్రియురాలితో కలిసి తల్లిదండ్రులు, చెల్లి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శ్వేత పట్టుబడింది. గురువారం నగర 47వ ఏసీజేఎం కోర్టులో శ్వేతను పోలీసులు హాజరుపరిచి మరింత సమాచారం కోసం 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మరోపక్క పరారీలో ఉన్న ప్రియుడు కెన్నెత్ కూడా పోలీసులకు పట్టుబడ్డారు. త్రిబల్ మర్డర్ కేసులో శ్వేత, కెన్నెత్‌ల అరెస్ట్ కోసం 6 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో తీవ్రంగా గాలించి 23వ తేదీన పుదుచ్చేరి రైల్వేస్టేషన్‌లో శ్వేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
పుదుచ్చేరిలో పట్టివేత
కానీ ప్రియుడు కెన్నెత్ పరారీలో ఉండగా గురువారం రాత్రి పుదుచ్చేరి అణ్ణాసలై ప్రదేశంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒర్లియన్ పేట పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. కెన్నెత్ హత్య చేయలేదని శ్వేత తెలిపినప్పటికీ సోమసుందర్ చనిపోయే కొద్ది నిమిషాల ముందు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు కీలక మలుపు తిరిగింది. కెన్నెత్ తమపై దాడి చేశాడని వాంగ్మూలం ఇచ్చారు. ఇదే ఆధారంగా కెన్నెత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇది చాలా కీలక కేసు కావడంతో సోషల్ మీడియా లేదా ఎలాంటి మీడియాలో తప్పుడు సమాచారం వైరల్ చేయరాదని దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు కారణాలు, పూర్తి సమాచారం మేం తెలియజేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు.
ఈసారి మైసూరు దసరాలో కంబళ వేడుకలు
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ నాడ ఉత్సవం మైసూరు దసరా సమయంలో ఈసారి కంబళ పోటీలు నిర్వహించాలని సీఎం డీకే శివకుమార్ ఆదేశించారు. అందువల్ల ఈసారి దసరా సమయంలో కంబళ ఉత్సవాన్ని నిర్వహిస్తామని పుత్తూరు ఎమ్మెల్యే అశోక్ రాయ్ తెలిపారు. ఆయన శుక్రవారం మైసూరుకు చేరుకుని కంబళ నిర్వహణకు అనుకూలంగా ఉన్న సాత్‌గల్లి, విజయనగర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సాత్‌గల్లి దగ్గర విశాలమైన ప్రాంతం ఉంది. ఈ స్థలం అనువైందని జిల్లా యంత్రాంగం కూడా చెప్పింది. కానీ ఇంకా ఏ స్థలాన్నీ ఖరారు చేయలేదు. స్థలం గురించి సీఎంకు తెలియజేస్తామని ఆయన చెప్పారు.


