సాక్షి, బళ్లారి: కుల, మతాలకు అతీతంగా జరుపుకునే మొహర్రం (పీర్ల పండుగ)ను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని కౌల్ బజార్, రూపనగుడి రోడ్డు, మిల్లార్ పేట, కణేకల్లు బస్టాండ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పీర్లను ఉరేగించారు. యువత అలావ్ (నృత్యాలు) తొక్కుతూ సందడి చేశారు. పీర్లను ఎత్తుకుని అగ్నిగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సిరుగుప్ప తాలూకాలోని భుజంగ నగర్, జాలిహాల్, జాలిబెంచి, ఏళుబెంచి తదితర గ్రామాల్లోనూ మొహర్రం వేడుకలు వైభవంగా జరిగాయి. కొన్ని గ్రామాల్లో ముస్లింలు లేకపోయినా హిందువులే సంప్రదాయబద్ధంగా పీర్ల పండుగను నిర్వహించడం విశేషం. సంప్రదాయం ప్రకారం పూజారి ముందుగా అగ్నిగుండంలోకి ప్రవేశించగా.. భక్తులు కూడా అగ్నిగుండంలో నడిచి భక్తిని చాటుకున్నారు. మొహర్రం పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ పీర్ల చావడులు, సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
యాదగిరి జిల్లాలో..
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని యాదగిరి జిల్లా సురుపుర తాలుకా తళవారలో ముస్లింలు లేకపోయినా మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. హిందువులు మతసామరస్యంతో పండుగను జరుపుకోవడం విశేషం. ఆరు రోజల పాటు జరిగే మొహర్రంలో వేడుకల్లో హసేని, హుసేనీ, సయ్యద్ కాశీం, లాలసాబ్, మౌలాలీ పీర్లను అలకరించి కొలువుదీరుస్తారు. పక్క గ్రామం వాగిణి గేరి ముస్తఫా రోజూ పీర్లకు చదివింపులు చేస్తారు. చివరి రోజు భక్తి గీతాలు పాడుతూ పీర్లను జలధికి తరలిస్తారు.
విజయ నగర జిల్లాలో..
హొసపేటె: మత సామరస్యానికి ప్రతీకగా జరిగే మొహర్రం వేడుకలను విజయనగర జిల్లాలో గురువారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. భక్తులంతా కుడుక బెల్లం, అగరబత్తీలతో పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. యువకులు అగ్నిగుండం చుట్టూ అలావ్ ఆడుతూ హోరెత్తించారు. హొసపేటె నగరంలో రామ టాకీస్ వద్ద వెలసిన ప్రసిద్ధ రామాలి మసీదు, చిత్తవాడిగి ప్రాంతంలో కొలువుదీర్చిన పీర్లను భక్తులు దర్శించుకున్నారు.
నియోజక వర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు
హొసపేటె: సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ విజయనగర జిల్లా కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ శుక్రవారం పీర్ల దేవుళ్లను ప్రార్థించారు. పట్టణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మొహర్రం పండుగను శాంతియుతంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కూడ్లిగి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గురుసిద్దన్, అధ్యక్షుడు కావల్లి శివ ప్రనాయక, రిటైర్డ్ తాలూకా కార్యనిర్వహణాధికారి బసన్న, డాని రాఘవేంద్ర, ఇతర నాయకులు పాల్గొన్నారు.
పీర్లకు భక్తిశ్రద్ధలతో చక్కెర చదివింపులు
అగ్ని గుండంలో దిగి మొక్కులు
చెల్లించుకున్న భక్తులు
అలావ్ తొక్కుతూ యువత సందడి


