రైలు కిందపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి మృతి

Jun 27 2026 2:13 AM | Updated on Jun 27 2026 2:13 AM

హుబ్లీ: నగరంలోని నవలూరు రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. 5.6 అడుగుల ఎత్తు గోధుమ రంగు ఛాయ, సాధారణ శరీరం కుడి అరచేతిపై ఓం అకారంలో త్రిశూలం పచ్చబొట్టు అలాగే ఎడమ చేతిపై కృష్ణుడి బొమ్మతో పాటు ఓం అని పచ్చ వేయించుకున్నాడు. ఈ వ్యక్తి వివరాలు ఎవరికై నా తెలిస్తే హుబ్లీ పోలీసులను సంప్రదించాలి. వివరాలకు 0836–2364751 నంబర్‌కు ఫోన్‌ చేయాలని రైల్వే పోలీసులు ఓ ప్రకటనలో కోరారు.

మహిళకు బెదిరింపులు

హుబ్లీ: పాత పగల నేపథ్యంలో ఓ మహిళ ఇంట్లోకి చొరబడి, ప్రాణాలు తీస్తామని బెదిరించడమే కాకుండా దేవుడి గదిలో ఉంచిన సుమారు రూ.8 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు గాజులను దోచుకెళ్లినట్లు వచ్చిన ఫిర్యాదుపై బి.రోహన్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు రూప బెండిగేరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రోహన్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. ‘నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతావా? నీ అంతు చూస్తా. కోర్టు కేసుల కోసం నాకు చాలా డబ్బు ఖర్చయింది. డబ్బులు ఇవ్వు, లేకపోతే బంగారం ఇవ్వు’ అంటూ బెదిరించినట్లు పేర్కొన్నారు. అనంతరం దేవుడి గదిలో ఉన్న 80 గ్రాముల బంగారు గాజులను తీసుకుని వెళ్లినట్లు మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీ రోడ్డుకు

మరమ్మతులు చేయరా?

హుబ్లీ: హుబ్లీ ధార్వాడలో స్మార్ట్‌ సిటీ పథకం కింద కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని మంగళ వీధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం సీసీ రోడ్డు తవ్వి, పనులు పూర్తయిన తర్వాత కూడా రోడ్డును పునరుద్ధరించ లేదు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో స్థానికులు మంగళ వీధి నుంచి కార్వార్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనను విరమింపజేయడానికి వచ్చిన పోలీసుల సమక్షంలోనూ స్థానికులు పాలికె అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా డ్రైనేజీ పనుల కోసం తవ్వి దెబ్బతిన్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మాన్విలో నగదు చోరీ

రాయచూరు రూరల్‌: మాన్వి పట్టణంలో మహిళ దృష్టిని మళ్లించిన దుండగులు రూ.16 లక్షల నగదు చోరీ చేశారు. వివరాలు.. అమరమ్మ అనే మహిళ బ్యాంకు నుంచి రూ.16 లక్షలు డ్రా చేసి నగదును సంచిలో పెట్టుకుంది. మార్గమధ్యంలో ఓ కిరాణా దుకాణం వద్ద ఆగింది. దుండగులు పథకం ప్రకారం ఓ చిన్నారిని ఆమెకు అడ్డంగా నిలబెట్టి, ఆమె దృష్టి మరల్చారు. సంచిలో ఉన్న రూ.16 లక్షల నగదును తీసుకుని పారిపోయారు. కొంత సమయం తరువాత అమరమ్మ సంచిలో చూడగా నగదు కనిపించక పోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కెంచరెడ్డి తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

బస్సుపాసుల

జారీ నిలిపివేత

హుబ్లీ: వాయువ్య కేఎస్‌ఆర్‌టీసీ పరిధిలో విద్యార్థుల బస్సుపాస్‌ దరఖాస్తుల స్వీకరణ, కార్డుల పంపిణీ సేవలను ఈనెల 25 నుంచి రెండు రోజుల పాటు నిలిపి వేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సేవ సింధు పోర్టల్‌ ద్వారా బస్సుపాసులు జారీ చేయడం జరుగుతోందన్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయినట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ రాత్రి 10 గంటల తరువాత యథావిధిగా సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

గిరీష్‌ గదిగప్ప గౌడరపై వేటు

ఆరేళ ్లపాటు

కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌

హుబ్లీ: పార్టీ నిబంధనలు ఉల్లఘించిన కారణంతో హుబ్లీ ధార్వాడ నగర జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి గిరీష్‌ గదిగప్ప గౌడరను 6 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌ చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమగ్ర పరిశీలన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ పేర్కొంది. బహిరంగంగా గిరీష్‌ కాంగ్రెస్‌ చూపిన తీరు.. అలాగే పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకున్న అంశాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పార్టీ పెద్దల సూచనల మేరకు గిరీష్‌ను పార్టీ నుంచి తప్పించారు. ఈ నిర్ణయాన్ని కేపీసీసీ అధ్యక్షుడు హరి ప్రసాద్‌ ఆమోదించారని మహానగర జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అల్తాఫ్‌ అల్లూరా ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement