కోలారు: నగరంలోని టీకల్ రోడ్డులో ఉన్న వాసవీ భవనంలో శుక్రవారం శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.. లోక కళ్యాణం కోసం జిల్లాలో వర్షాలు బాగా పడి పంటలు సమృధ్దిగా పండాలని శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్న సంతర్పణ జరిగింది.
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
కోలారు: పాలక ప్రభుత్వాలు విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు చలవాది నారాయణస్వామి విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం నగర సమీపంలోని మూరాండహళ్లి క్రాస్ వద్ద కోలారు ఇంటర్ నేషనల్ స్కూల్, ఇంటర్ కళాశాల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య మానవుడికి అత్యంత అవసరం అని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ ఎం.మల్లేష్ బాబు, విద్యా సంస్థల అధ్యక్షుడు ఎస్.బి.మునివెంకటప్ప, జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షురాలు రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.
బైక్ చోరీపై ఫిర్యాదు
హోసూరు: ఇంటి ముందు నిలిపిన బైక్‌ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. వివరాల మేరకు.. హోసూరు కార్పొరేషన్ పరిధిలోని అణ్ణానగర్‌కు చెందిన హరి. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి బైక్‌ను ఇంటి ముందు నిలిపి నిద్రించాడు. ఉదయం లేచి చూసే సరికి బైక్ కనిపించక లేదు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు.
పీడీపీఎస్ పథకాన్ని
సద్వినియోగం చేసుకోండి
శ్రీనివాసపురం: పీడీపీఎస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎం.ఆర్.రవి తెలిపారు. శుక్రవారం శ్రీనివాసపురం పట్టణంలోని ఏపీఎంసీ మార్కెట్ సభాంగణంలో మామిడి రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండ్లు కాకముందే మామిడి కాయలను మార్కెట్‌కు తీసుకుని రావాలన్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం నుంచే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కోలారు, శ్రీనివాసపురం, ముళబాగిలు, కెజీఎఫ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. జిల్లా మామిడి ఉత్పత్తిదారుల క్షేమాభివృద్ధి సంఽఘం అధ్యక్షుడు నీలటూరు చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలన్నారు. అనంతరం కలెక్టర్ రోణూరు రైతు సంపర్క కేంద్రాన్ని సందర్శించారు.


