రాయచూరు రూరల్: అర్హులకే పంచ గ్యారెంటీలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచ గ్యారెంటీల సమితి అధ్యక్షుడు హెచ్.ఎం.రేవణ్ణ ఆదేశించారు. శుక్రవారం పాత్రికేయల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకాల దుర్వినియోగానికి సంబంధించి ఇప్పటికే రూ.15 కోట్లు వసూలు చేశామన్నారు. మిగిలిన రూ.100 కోట్ల విషయంలో బ్యాంక్ అధికారులతో చర్చిస్తామన్నారు. మరణించిన వారి ఖాతాలో పడిన డబ్బు రికవరీలో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు వివరించారు. అన్నభాగ్య పథకంలో నియమాలు ఉల్లంఘించిన 14 మంది డీలర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 6,847 రేషన్ కార్డులను రద్దు చేసి, 9,631 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్నభాగ్య పథకంలో డీబీటీ ద్వారా రూ.508.72 కోట్లు, శక్తి పథకంలో రూ.608 కోట్లు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. పంచ గ్యారెంటీలను నిరాటంకంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కనకదాస జీవితం ఆదర్శం..
రాయచూరు రూరల్: ప్రస్తుత సమాజంలో యువత చెడువ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. శరణుల తత్వాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను యువతకు నేర్పించాలని రాష్ట్ర పంచ గ్యారెంటీల సమితి అధ్యక్షుడు హెచ్.ఎం.రేవణ్ణ పేర్కొన్నారు. గురువారం రాత్రి పండిత ిసిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో కనకదాస అధ్యయన కేంద్రం, కురుబ సంఘం ఆధ్వర్యంలో ముత్త బందిదె కేరిగె కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనకదాస వచనాల ద్వారా యువకుల్లో మార్పులు తేవాలన్నారు. కనకదాస జీవిత విశేషాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, సాయి కిరణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


