ఐడీసీఏ టీ20 టోర్నీ చాంపియన్‌గా కర్ణాటక | - | Sakshi
Sakshi News home page

ఐడీసీఏ టీ20 టోర్నీ చాంపియన్‌గా కర్ణాటక

Jun 27 2026 2:13 AM | Updated on Jun 27 2026 2:13 AM

అనంతపురం: ఇండియన్‌ డెఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఐడీసీఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఐడీసీఐ–19 టీ–20 చాంపియన్‌ షిప్‌ టోర్నీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. శుక్రవారం జరిగిన రెండు సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లూ ఉత్కంఠ భరితంగా సాగాయి. హర్యానా, ఒడిశా జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌లో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఒడిశా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు సాధించింది. 128 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన హర్యానా జట్టు కూడా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌లో తలపడాల్సి వచ్చింది. ఈ దశలో హర్యానా జట్టు వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు సాధించగా, ఒడిశా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 6 పరుగులకే పరిమితమైంది. దీంతో హర్యానా జట్టును విజేతగా ప్రకటించారు.

● రెండో సెమీఫైనల్‌లో ఢిల్లీ జట్టుపై తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు సాధించింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగుల వద్ద చతికిలబడింది. 47 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. సనిత్‌ శెట్టి అద్భుతమైన నాటౌట్‌ ఇన్నింగ్స్‌ (87 పరుగులు)తో కర్ణాటకను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

ఫైనల్‌లో రాణించిన కర్ణాటక బౌలర్లు

ఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటక బౌలర్లు రాణించారు. హర్యానా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి 15.5 ఓవర్ల వద్ద 74 పరుగులకే పరిమితం చేశారు. కర్ణాటక బౌలర్‌ సాగర్‌ అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో 5 వికెట్లు పడగొట్టి, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన కర్ణాటక జట్టు 13.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 78 పరుగులతో విజయం సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ (ఫైనల్‌)గా ఎం.యు.సాగర్‌ (కర్ణాటక) ఉత్తమ బౌలర్‌గా సాగర్‌ (కర్ణాటక), ఉత్తమ బ్యాటర్‌గా సతీష్‌ శెట్టి (కర్ణాటక), ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా సతీష్‌ శెట్టి (కర్ణాటక) నిలిచారు.

● ముగింపు వేడుకలో డీఆర్వో మలోల ముఖ్యఅతిథిగా హాజరై విజేతలను అభినందిస్తూ ట్రోఫీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఇండియన్‌ డెఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ సైని, ఆంధ్రప్రదేశ్‌ డెఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రఘు, అధికారులు, కోచ్‌లు, ఆటగాళ్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement