మామిడి రైతుకు కేంద్రం చేయూత | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతుకు కేంద్రం చేయూత

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

శివాజీనగర: ధరలు తగ్గడంతో తీవ్ర దిగులుతో ఉన్న మామిడి రైతులను ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్‌లో జోక్యం పథకం (ఎంఐఎస్‌) కింద 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల తోతాపురి రకం మామిడిని ప్రతి క్వింటాల్‌కు రూ.1,750 మద్దతు ధరను ప్రకటించింది. ఈ ఏడాది మామిడి దిగుబడి బాగానే ఉన్నా, మార్కెట్‌లో ధరలు లేవని రైతులు ఆందోళనతో ఉన్నారు. దేశాల మధ్య యుద్ధాల వల్ల ఎగుమతులు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్లలో గిరాకీ ఉన్నప్పటికీ అది దళారులు, వ్యాపారులకే పరిమితమైంది. అహోరాత్రులు కష్టించిన సాగుదారులకు తీవ్ర నష్టం తలెత్తింది. ఇటీవల కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, హెచ్‌డీ కుమారస్వామిలు రాష్ట్ర మామిడి రైతుల ఇబ్బందిపై వ్యవసాయ మంత్రి శివరాజసింగ్‌ చౌహాన్‌కు లేఖ రాశారు. అదనపు ధర చెల్లింపు కింద సహాయం చేయాలని కోరారు.

ధర ప్రక్రియ ఇలా...

ఏపీఎంసీ మార్కెట్లలో మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేయాలి. సుమారు నెల రోజుల పాటు ఇది అమలులో ఉంటుంది. ఈ ధరతో గరిష్టంగా 1.30 లక్షల మెట్రిక్‌ టన్నులను మాత్రమే కొంటారు. ఆ పరిమాణం దాటిన తరువాత పొడిగిస్తారా, లేదా? అనేది ఇంకా ప్రకటించలేదు. క్వింటాలు రూ.1,750 తో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది.

ధర ఇది వర్తించాలంటే రైతులు కర్ణాటకకు చెందిన ఏసీఎంసీ మండీలలో మామిడిని విక్రయించాలి. రాష్ట్ర ప్రభుత్వం 2026–27 మార్కెటింగ్‌ సీజన్‌కు తోతాపురి మామిడి వ్యాపారుల జాబితా ప్రకటించాలి. రైతుకు దక్కిన ధరను పరిశీలించి మిగతా సొమ్మును బ్యాంకు ఖాతాకు అందిస్తారు.

ఇప్పుడు ఎంత ధర?

ప్రస్తుతం తోతాపురి మామిడిని పండ్ల రసాల కంపెనీలు కేజీ రూ.5 లేదా 6 రూపాయలతో కొంటున్నాయని, ఇది ఎంతమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇటీవల కోలారు జిల్లాలో రోడ్లపై పారబోసి ఆందోళనలు చేయడం తెలిసిందే. బజార్లలో వ్యాపారులు గిరాకీని బట్టి ఇష్టానుసారం అమ్ముతున్నారు.

మామిడి ఉత్పత్తిలో అగ్రస్థానం

మామిడి ఉత్పత్తిచేసే ప్రముఖ రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. కోలారు, చిక్కబళ్లాపుర, రామనగర, బళ్లారి, ధార్వాడ, బెళగావి, విజయపుర, బాగలకోట, తుమకూరు, మండ్య, చన్నరాయపట్టణ తదితర జిల్లాల్లో వేలాది హెక్టార్లలో తోతాపురి సహా పలురకాల మామిడి తోటలు సాగవుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశముంది.

కేంద్రం సాయం: కుమార

రాష్ట్రంలోని మామిడి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పిందని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఎక్స్‌లో తెలిపారు. కేంద్రం ఎంఐఎస్‌ స్కీమ్‌ కింద 1.30 లక్షల టన్నుల తోతాపురి మామిడికి క్వింటాల్‌కి రూ.1,750 ఆర్థిక సాయం ఇచ్చేలా ఆదేశించిందని తెలిపారు.

తోతాపురి క్వింటాలు రూ.1,750

మద్దతు ధర ప్రకటన

ఏపీఎంసీలలో కొనుగోలుకు ఆదేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement