కావేరమ్మ ఒడిలో పెను విషాదం | - | Sakshi
Sakshi News home page

కావేరమ్మ ఒడిలో పెను విషాదం

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

మండ్య: ఎప్పుడూ ఇంటిపనులే. తీరిక చేసుకుని టూర్‌కు వచ్చామని అందరూ సంతోషంగా నదిలో ఆడుకుంటున్నారు, కానీ కొన్నిక్షణాల్లోనే మృత్యువు కాటేసింది. మండ్య జిల్లాలోని మళవల్లి తాలూకాలోని ముత్తత్తి సమీపంలో కావేరి నది ఒడ్డున నీటిలో దిగి ఆడుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు లోతైన చోట జారిపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలతో సహా ఐదుమంది జలసమాధి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులు విజయమ్మ (52), ఆమె కుమార్తెలు ప్రియాంక (28), శ్వేత (38), శ్వేత కుమార్తె చైత్ర (19), బెంగళూరుకు చెందిన కారు డ్రైవర్‌ మహేష్‌. వీరు చన్నపట్టణ వద్ద బ్యాడరహళ్లి వాసులు కాగా, కొందరు బెంగళూరులో నివసించేవారు.

ఒకరి తరువాత ఒకరు..

అందరూ కూడా బెంగళూరు నుంచి బాడుగ కారులో చన్నపట్టణ తాలూకాలోని కబ్బాలు ఆలయానికి ఒక విందు కోసం వచ్చి, ఆపై మళవల్లి తాలూకాలోని ముత్తత్తి పర్యాటక ప్రదేశాన్ని సందర్శించి ఆలయంలో దర్శనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం 4:45 సమయంలో కావేరి నదిలోకి దిగి ఆడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో విజయమ్మ లోతైన చోట మునిగిపోతూ కేకలు వేయసాగింది. ఆమెను కాపాడాలని వెళ్లిన కూతుర్లు, ఇతరులు ఒకరి వెంబడి మరొకరు పట్టుకుని మునిగిపోసాగారు. వారిని రక్షించడానికి వెళ్లిన కారు డ్రైవర్‌ మహేష్‌ కూడా గల్లంతయ్యాడు.

వీడియోలు వైరల్‌

పోలీసులు, ఫైర్‌ సిబ్బంది కొన్ని గంటల పాటు నదిలో గాలించి మృతదేహాలకు బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం హలగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మండ్య జిల్లా కలెక్టర్‌ కుమార్‌, ఎస్పీ విజె. శోభారాణి, డీఎస్పీ యశ్వంత్‌ కుమార్‌, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. బంధువులకు తెలిసి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఘటనకు కొంతసేపటి ముందు అందరూ నదిలో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.

తల్లి, ఇద్దరు కూతుళ్లు, వారి కుమార్తె.. కుటుంబమే జలసమాధి

మండ్య జిల్లా ముత్తత్తి వద్ద దుర్ఘటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement