డ్రగ్స్‌ కాల్చివేత | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కాల్చివేత

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

మైసూరు: జిల్లాలో దాడులు జరిపి స్వాధీనపరచుకున్న సుమారు రూ.10.55 లక్షల విలువైన మత్తు పదార్థాలను కోర్టు ఆదేశాల మేరకు గురువారం జిప్స్‌ బయోటెక్‌ పరిశ్రమలోని కొలిమిలో కాల్చివేశారు. ఎస్పీ మల్లికార్జున బాలదండి ఆదేశాలతో పోలీసులు మత్తు పదార్థాలను తరలించి దహనం చేశారు. 19 కేజీల గంజాయి, ఎండీఎంఏ పొడితో సహా పలు రకాల మత్తు పదార్థాలున్నాయి.

పోలీసు కస్టడీకి

అనుమానిత ఉగ్రవాది

బనశంకరి: పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టయిన యూపీ వలస కూలీ, అనుమానిత ఉగ్రవాది సొహైల్‌కు దావణగెరె జిల్లా హరిహర జేఎంఎఫ్‌సీ కోర్టు 10 రోజుల కస్టడీకి ఆదేశించింది. గురువారం హరిహర గ్రామాంతర పోలీసులు అతనిని కోర్టులో హాజరు పరిచి మరింత విచారణకు తమ కస్టడీకి అప్పగించాలని కోరగా, జడ్జి ఆమోదించారు. అతనిని పోలీసులతో పాటు ఏటీయు, ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఉగ్ర కార్యకలాపాలపై మరింత సమాచారం రాబట్టనున్నారు. సొహైల్‌ మొబైల్‌ను డేటా రికవరీ కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

కట్న పిశాచికి కారాగారం

శివమొగ్గ: అధిక కట్నం తేవాలంటూ కోసం భార్యను హింసించిన భర్తకు శివమొగ్గలోని 2వ జేఎంఎఫ్‌సి కోర్టు మూడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. కొత్తూరు నివాసి, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న మంజునాథ్‌ ముద్దాయి. డబ్బు తేవాలని, స్థలం రాసివ్వాలని భర్త వేధిస్తున్నాడంటూ అతని భార్య 2017లో శివమొగ్గ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించి చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సిద్దరాజు ఎన్‌కె ఈ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూటర్‌ జి కె కిరణ్‌కుమార్‌ వాదించారు.

వెండి దొంగకు సంకెళ్లు

శివాజీనగర: వెండి వస్తువులను విక్రయించే షాపు గోడ పగలకొట్టి 10 కేజీల వెండి సామగ్రి దొంగిలించిన దొంగను బెంగళూరులోని హలసూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడు శంకరపురానికి చెందిన తేజ (19) నిందితుడు. హలసూరు కార్‌ స్ట్రీట్‌లో ఏప్రిల్‌ 29న ఓ షాపు గోడకు రంధ్రం వేసి చొరబడిన తేజ.. 10 కేజీల వెండి సొత్తుతో ఉడాయించాడు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో గుర్తించి స్వస్థలానికి వెళ్లి అతనిని నిర్బంధించారు. 5 కేజీల వెండి సామగ్రిని రికవరీ చేశారు.

ఒక్కో మంత్రికి 2, 3 జిల్లాలు

ఇన్‌చార్జిలుగా నియామకం

శివాజీనగర: సీఎం డీకే శివకుమార్‌ తమ మంత్రులకు జిల్లాల ఇన్‌చార్జిల బాధ్యతలను కేటాయించారు. కేబినెట్‌లో 13 మంది మంత్రులు ఉన్నారు. చాలావరకు మంత్రుల సొంత జిల్లాలనే కాకుండా మరికొన్ని జిల్లాలకు ఎంపిక చేశారు. డీసీఎం జీ.పరమేశ్వర్‌ను తుమకూరు, చిత్రదుర్గ జిల్లాల ఇన్‌చార్జిగా నియమించారు. మంత్రి కే.హెచ్‌.మునియప్పను బెంగళూరు గ్రామీణ, ఉమ్మడి బళ్లారి జిల్లాలు, మంత్రి రామలింగారెడ్డిని బెంగళూరు దక్షిణ, మండ్య జిల్లాలు, ఎం.బీ.పాటిల్‌– విజయపుర, బాగలకోట, కే.జే.జార్జ్‌– శివమొగ్గ, చిక్కమగళూరు, దావణగెరెలు, కృష్ణభైరేగౌడ– బెంగళూరు నగర, హాసన్‌ జిల్లాలు, ఈశ్వర్‌ ఖండ్రె బీదర్‌, గదగ్‌ జిల్లాలు, సతీశ్‌ జార్కిహొళి– బెళగావి, ధార్వాడ, హావేరి జిల్లాలు, ప్రియాంక్‌ ఖర్గే– కల్బుర్గి, యాదగిరి జిల్లాలు, మంత్రి శరణప్రకాశ్‌ పాటిల్‌ రాయచూరు, కొప్పళ, యూటీ ఖాదర్‌ – ఉడుపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, కొడగు జిల్లాలు, భైరతి సురేశ్‌– కోలారు, చిక్కబళ్లాపుర, యతీంద్రను మైసూరు, చామరాజనగర జిల్లాల ఇన్‌చార్జులుగా నియమించారు.

దోపిడీ ముఠా ఆటకట్టు

యశవంతపుర: చవగ్గా హోటల్‌ సామగ్రి, క్రిప్టో కరెన్సీ పేరిట వ్యాపారిని దోచుకున్న ఘటనలో బెంగళూరు సంజయనగర పోలీసులు 12 మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.13.90 లక్షల నగదు, 6 బైకులు, ఒక కారు, 13 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సంజయనగర కొడిగేహళ్లిలోని దేవినగరలో ఉంటున్న వ్యాపారి కేఫ్‌ పెట్టాలని వస్తు సామగ్రి కోసం నెట్‌లో వెతికారు. ఇంతలో నిందితులు ఆయనకు కాల్‌ చేసి ఈ పరికరాలు చవగ్గా దొరుకుతాయని చెప్పారు. తమ వాట్సాప్‌ గ్రూపులో ఇతని నంబర్‌ను చేర్చారు. రూ.17.64 లక్షలకు సామగ్రి ఇప్పిస్తామని, కానీ ఈ డబ్బును క్రిప్టో ద్వారా ఇస్తే భద్రంగా ఉంటుందని నమ్మించారు. ఫలానా చోటుకు డబ్బుతో రమ్మనగా వెళ్లాడు, దుండగులు అతని నుంచి డబ్బులు లాక్కుని పారిపోయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement