మంగళూరులో షారుఖ్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

మంగళూరులో షారుఖ్‌ సందడి

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

యశవంతపుర: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కరావళి నగరి మంగళూరులో పర్యటించారు. ఆయనను చూడాలని అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. గురువారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో మంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఎయిర్‌పోర్టు బయట అభిమానులు చేరుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య షారూక్‌ బయటకు వచ్చి అభివాదం చేయడంతో అందరూ కేరింతలు కొట్టారు. కొంతదూరం రూఫ్‌ టాప్‌లో కనిపించి అలరించారు. అడ్యార్‌ గార్డెన్‌లో ఓ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో షారుఖ్‌ ఖాన్‌ పాల్గొన్నారు. మంగళూరు ప్రముఖులు ఆయనను కలిశారు.

కరువును ఎదుర్కోవాలి: డీసీఎం

బనశంకరి: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, సూపర్‌ ఎల్‌ నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ సూచించారు. గురువారం విధానసౌధలో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనావృష్టి, తాగునీరు, పశువులకు మేత కొరత తదితరాల గురించి చర్చించారు. ప్రపంచస్థాయి ఎల్‌ నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తే పరిణామాలు, వర్షం కొరత వల్ల కరువు, ఇతర సమస్యల పరిష్కారానికి ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా, పశువుల మేతకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జిల్లాల కలెక్టర్లకు సకాలంలో సూచనలు చేయాలన్నారు. తాగునీటి కోసం బోర్ల తవ్వడానికి వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. 122 తాలూకాల్లో తాగునీటి కొరత ఉందని 139 పల్లెలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement