రాయచూరు రూరల్: లేఔట్ నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమికి అనుమతి ఇవ్వడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న పీడీఓ లక్ష్మి ప్యాటీని లోకాయుక్త అధికారులు అరెస్ట్ చేశారు. రాయచూరు తాలూకా బిజి నగర పంచాయతీ పరిధిలోని ఉండ్రాళ దొడ్డిలో జరిగింది. ఫిర్యాదిదారు మహబూబ్ నుంచి రూ.1.50 లక్షలను ఆమె తన భర్తకు ఫోన్ పే చేయించింది. మిగిలిన రూ.50 వేలను తీసుకుంటూ ఉండగా లోకాయుక్త అధికారులు దాడి చేసి అరెస్టు చేశారు.
విమానం రద్దుపై ఆగ్రహం
శివమొగ్గ: శివమొగ్గలోని కువెంపు విమానాశ్రయం నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం సోమవారం చివరి నిమిషంలో అకస్మాత్తుగా రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు స్పైస్‌జెట్ విమానంలో 60 మంది ప్రయాణికులు తిరుపతికి బయలుదేరాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 1:30 గంటలకు.. సర్వీసు రద్దయినట్లు సిబ్బంది ప్రకటించారు. మరో ఫ్లైటు లేకపోవడంతో ప్రయాణికులు దిక్కులు చూశారు. ఎయిర్‌లైన్స్ తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో గురువారం స్పైస్‌జెట్ యాజమాన్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.


