హుబ్లీ: వారంలో రెండో సారి ధార్వాడ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. కోర్టు పాలన కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా ఈ సందేశం అందింది. దీంతో కొన్ని గంటల పాటు కోర్టు ఆవరణలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. కోర్టుతో పాటు కాంప్లెక్సులో బాంబు పెట్టినట్లు బెదిరింపు సందేశ సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై తక్షణమే క్షుణ్ణంగా అణువణువు గాలింపు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వచ్చిన ప్రజానీకాన్ని బయటకు పంపించారు. ఈ నెల 19న ధార్వాడ కోర్టు పాలనా కార్యాలయానికి ఈ–మెయిల్‌లో బెదిరింపు సందేశం వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో మధ్యాహ్నం 2 గంటలకు మీ కోర్టులో 23 ౖసైనెడ్ వాయు తూటాలు పేలతాయని ఈ–మెయిల్ బెదిరింపు సందేశం అందింది. దీంతో కోర్టు చుట్టు పక్కల ఆందోళనకర వాతావరణం నెలకొనగా బాంబు స్క్వాడ్ కోర్టులో అణువణువు గాలించింది. మొత్తానికి వారంలోనే రెండో సారి కోర్టుకు బెదిరింపు సందేశం రావడంతో పోలీసులతో పాటు కోర్టు సిబ్బందికి తలనొప్పిగా మారింది.


