రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గత మూడేళ్లలో రాయచూరు, కొప్పళ జిల్లాలకు ఇంచార్జి మంత్రిగా వైద్య విద్యా శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్‌ను నియమితులయ్యారు. తాజాగా మరోసారి మంత్రి పదవిని దక్కించుకున్న పాటిల్‌ను తిరిగి జిల్లాకు ఇంచార్జి మంత్రిగా కేటాయించారు. కళ్యాణ కర్ణాటకలో కలబుర్గి, యాదగిరి జిల్లాలకు ఇంచార్జి మంత్రిగా ప్రియాంక్ ఖర్గేను, బీదర్, గదగ్ జిల్లాలకు ఈశ్వర్ ఖండ్రె, విజయపుర, బాగల్‌కోటెలకు ఎం.బీ.పాటిల్‌ను ఇంచార్జి మంత్రులుగా నియమించారు.
సేవా మూర్తికి సత్కారం
హుబ్లీ: విక్రమ్ భాయి ఫౌండేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా జంట నగరాల్లోని వివేకానంద, మైత్రి వృద్ధాశ్రమాల్లో ప్రతి నెలా భోజన వసతితో పాటు కావాల్సిన నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా మందులను తన దాతృత్వ గుణంతో అందించే ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు విక్రమ్ భాయి బూరట్ 50వ జన్మదిన వేడుకను నిరాశ్రయులు, నిర్భాగ్యులు, ఆపన్నుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. వృద్ధాశ్రమంలోని అవ్వ, తాతలకు తనదైన శైలిలో ఆత్మీయత, అనురాగాలను పంచి వారి ఆశీస్సులు అందుకున్నారు. ముఖ్యంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్నేహ వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు ప్రముఖులు సేవా మూర్తి విక్రమ్ బూరట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ సింఘి పరివార్ విక్రమ్ బాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
సారాయి అడ్డాపై దాడి..
ఇద్దరు అరెస్ట్
హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి సమీపంలోని వాగులో అక్రమంగా దొంగ సారాయి తయారు చేస్తున్న అడ్డాపై ఎకై ్సజ్ పోలీసులు దాడి చేశారు. శేఖర్ విరుపాక్షి(26), సాగర(31)లను అరెస్ట్ చేసి అక్కడ ఉన్న వాహన యజమాని కోసం గాలింపు చేపట్టారు. అణ్ణిగేరి సరిహద్దులోని కనగల్ల వాగులో అక్రమంగా సారాయి కాస్తుండగా ఎకై ్సజ్ సీఐ రాము, ఏఎస్‌ఐ అనురాధ హొలేకార్, వాహన డ్రైవర్ మల్లికార్జున, హోంగార్డ్ కల్లయ్య, శరీఫ్ తదితరులు అణ్ణిగేరి పట్టణ పంచాయతీ సిబ్బందితో కలిసి దాడి చేశారు. 2 లీటర్ల దొంగ సారాయి, ఇతర సంబంధిత వస్తువులు, ప్లాస్టిక్ బ్యారళ్లు, బెల్లం రసాయనాలు తదితరాలతో పాటు ద్విచక్ర వాహనం, ఓ మొబైల్ ఫోన్, ఓ స్మార్ట్ ఫోన్‌ను కూడా జప్తు చేసినట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు.
బస్సు, బైక్ ఢీ.. ముగ్గురు యువకుల దుర్మరణం
రాయచూరు రూరల్: బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన ఘటన కలబుర్గి జిల్లాలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. మృతులను కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా కరదాళ వద్ద బమ్మనహళ్లి నివాసి దేవరాజ్ అయ్యప్ప(19), ముడ్బాళ లక్ష్మికాంత్(24), సేడం తాలూకా బిజనళ్లి నివాసి ప్రకాష్ బసప్ప(22)గా పోలీసులు గుర్తించారు. చిత్తాపుర నుంచి సన్నతికి వెళుతున్న ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. చిత్తాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శంకర్‌గౌడ తెలిపారు. ఘటన స్థలాన్ని సీఐ ఎస్‌సీ పాటిల్, ఎస్‌ఐ మంజునాథ్ రెడ్డి పరిశీలించారు.
మైనర్ల బైక్ రైడింగ్.. తండ్రులకు జరిమానా
హుబ్లీ: ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి ముగ్గురు మైనర్లు బైక్ నడుపుతూ పట్టుబడిన ఆరోపణలపై నగర తూర్పు ట్రాఫిక్ పోలీసులు సదరు బాలుర తండ్రులకు కోర్టు నోటీసులు ఇచ్చి జరిమానా విధించారు. వివరాలు.. సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మైనర్ బాలురు బైక్ నడుపుతూ పట్టుబడ్డారు. వారిని విచారించగా వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇంకా 18 ఏళ్ల వయస్సు నిండలేదని తేలింది. దీంతో పోలీసులు బాలల తండ్రులకు నోటీసులిచ్చి 3వ సెషన్స్ కోర్టులో ఒక్కో బాలుడి తండ్రికి రూ.25 వేల చొప్పున జరిమానా విధించి వసూలు చేశారు.
గుండెపోటుతో
కానిస్టేబుల్ మృతి
రాయచూరు రూరల్: విధి నిర్వహణలో గుండెపోటుతో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జిల్లాలో జరిగింది. మృతుడిని దేవదుర్గ సీఐ వాహనం డ్రైవర్, 2008 పోలీస్ బ్యాచ్‌కు చెందిన లింగసూగూరు తాలూకా అమదిహాళ్‌కు చెందిన రేణుకా రాజ్(38)గా గుర్తించినట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. దేవదుర్గ తాలూకా మదరకల్ పంచాయతీ పరిధిలో మొహర్రం సందర్భంగా రేణుకా రాజ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడని తెలిపారు.
ప్రైవేటీకరణ చేయరాదు
కోలారు: విద్యుత్ రంగ ప్రైవేటీకరణను ఖండిస్తూ దళిత సంఘటనల సమన్వయ సమితి సభ్యులు గురువారం వేమగల్ బస్టాండు వద్ద ఆందోళన చేశారు. జిల్లా అధ్యక్షుడు పురహళ్లి జి యల్లప్ప మాట్లాడుతూ విద్యుత్ శాఖను 19 జిల్లాలలో టాటా కంపెనీకి అప్పజెప్పడం వల్ల రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ంగా నష్టపోతారని అన్నారు. రైతుల హితవు కోసం ప్రైవేటీకరణను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. ఎస్ నారాయణస్వామి, బి మునిరాజు, నాగనాళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


