రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతులు పొలంలో వేసుకున్న పైర్లు వాడుముఖం పడుతున్న నేపథ్యంలో రైతులు దేవుళ్లకు మొర పెట్టుకుంటున్నారు. దేవదుర్గ తాలూకా రామదుర్గలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా బుధవారం సాయంత్రం గాడిదలకు పూజలు జరిపి పెళ్లి చేశారు. వాటిని గ్రామంలో తిప్పుతూ వానలు కురువాలని ప్రార్థించారు.
అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడి
రాయచూరు రూరల్: ప్రజలకు అధిక ధరతో వడ్డీ వసూలు చేస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై గదగ్ పోలీసులు దాడి చేశారు. గురువారం గదగ్ నగరంలో అక్రమంగా అధిక రేట్లకు వడ్డీలు ఇచ్చే వ్యాపారుల ఇళ్లపై జిల్లా ఎస్పీ ఆర్.జగదీష్ ఆధ్వర్యంలో దాడులు జరిపారు. వడ్డీలకు చక్ర వడ్డీలు వేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో దాడులు చేశామని ఎస్పీ తెలిపారు. మనోహర్ కట్టిమని నుంచి 150 చెక్‌లు, 65 ఖాళీ బాండ్లు, 9 బ్యాంక్ పాస్ బుక్‌లు, 5 ఏటీఎం కార్డులు, మూడు పాన్ కార్డులు, రూ.60 లక్షల విలువ చేసే బంగారు నగలు, రూ.5.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రోడ్ల అభివృద్ధికి పెద్దపీట
రాయచూరు రూరల్: రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించినట్లు రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్ పేర్కొన్నారు. రాయచూరు తాలూకా మామిడిదొడ్డి, కొర్విహాళ్, శివ విలాస్ నగర్, సగమకుంట, మాడుమాన్‌దొడ్డి, గంజహళ్లి వరకు కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి మంజూరైన రూ.3 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి ఆయన మాట్లాడారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు.
అప్పుల బాధతో
వ్యక్తి ఆత్మహత్య
క్రిష్ణగిరి: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన క్రిష్ణగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా ఆర్.ఎస్.లక్ష్మీపురం గ్రామానికి చెందిన స్టీఫన్ రాజ్ (34). డిజిటల్ బ్యానర్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. వ్యాపారం మందకొడిగా సాగడంతో సరైన రాబడి లేక అప్పల పాలయ్యాడు. వ్యాపారం కోసం తీసుకొన్న అప్పు కూడా తీర్చలేకపోయాడు. అప్పు ఇచ్చిన వారు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో జీవితంపై విరక్తి చెందిన స్టీఫన్ రాజ్.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకొన్న క్రిష్ణగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
వార్త ప్రచార శాఖ
కమిషనర్‌గా అనుచేత్
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారుల బదిలీల్లో భాగంగా వార్త, ప్రచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా డీఐజీ ఎంఎన్ అనుచేత్‌ను నియమించారు. గురువారం బెంగళూరులోని ప్రధాన కేంద్ర కార్యాలయంలో కమిషనర్‌కు ఏడీజీపీ హేమంత్ నింబాళ్కర్ బాధ్యతలు అప్పగించారు. అనుచేత్ కోలారు జిల్లా వాసి కావడం విశేషం. ఈసందర్భంగా అధికారులు మంజునాథ్ డొళ్లిన్, సిద్దేశ్వరప్ప, నవీన్, రామలింగప్ప, శఫీ సాదుద్దీన్‌లు అభినందించారు.
ట్రాఫిక్ సమస్యను తీర్చండి
హోసూరు: డెంకణీకోట మార్గంలోని రింగ్‌రోడ్డు ఆర్సీ చర్చి వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని గురువారం ఉదయం ఆ ప్రాంతంలో పర్యటించిన హోసూరు మేయర్ ఎస్.ఏ.సత్య ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. పట్టణంలోని పలు ప్రాంతాలకు వెళ్లి ప్రజల సమస్యలను పరిశీలించారు. డెంకణీకోట రోడ్డులోని ఆర్సీ చర్చి వద్ద రింగ్ రోడ్డుపై నాలుగు వైపులా వాహనాలు నిలిచిపోతున్నాయని, దీని వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో వాహనాలు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మేయర్ సూచించారు.


