రాయచూరు రూరల్: ఎరువుల బస్తాల మధ్య మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న వాహనాన్ని విజయపుర పోలీసులు అడ్డుకున్న ఘటన జిల్లా సరిహద్దులో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి గోవా నుంచి మహారాష్ట్రకు లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.కోట్లాది విలువ చేసే మద్యం బాటిళ్ల వాహనాన్ని కోల్హార టోల్ వద్ద విజయపుర పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తనిఖీ సమయంలో పోలీసులకు అనుమానం రాగా ఎరువుల బస్తాలను దించి చూడగా వాటిలో మద్యం బాటిళ్లు కనబడ్డాయి. లారీ డ్రైవర్లకు జీపీఎస్‌తో కూడిన మొబైల్ ఫోన్లను అందించారు. బెళగావి, బాగల్‌కోటె, ధార్వాడ జిల్లాల తర్వాత విజయపురను దాటుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి 12,952 లీటర్ల మద్యం, 290 బాక్సుల మ్యాన్షన్ హౌస్, 397 రాయల్ బ్లూ బాక్స్, 800 రాయల్ సెలెక్ట్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లారీతో పాటు రూ.1.65 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. గదగ్‌కు చెందిన శ్రీనివాస్ మీసె, విజయపుర హుసేన్ సాబ్ ముల్లా, బసవరాజ్ భజంత్రి, మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన సిద్దరామలను అరెస్ట్ చేశామని ఎస్పీ లక్ష్మణ్ నింబరిగి తెలిపారు.
గోవా నుంచి లారీలో సరుకు సరఫరా
పట్టుకున్న విజయపుర పోలీసులు


