రాయచూరు రూరల్: పంచ గ్యారంటీలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర పంచ గ్యారెంటీ కమిటీ అధ్యక్షుడు హెచ్‌ఎం రేవణ్ణ అధికారులను ఆదేశించారు. కలబుర్గి డివిజన్ కార్యాలయంలో కళ్యాణ కర్ణాటక అధికారులతో సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దుర్వినియోగానికి పాల్పడిన రూ.15 కోట్లు వసూలు చేశామని, మిగిలిన రూ.100 కోట్ల విషయంలో బ్యాంక్ అధికారులతో చర్చిస్తామన్నారు. మరణించిన వారి ఖాతాలో పడిన డబ్బుల వసూలు విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నట్లు తెలిపారు. అన్న భాగ్య పథకంలో నియమాలను ఉల్లంఘించిన 14 మంది డీలర్ల లైసెన్స్, 6,847 కార్డులను రద్దు చేశామన్నారు. 9,631 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్న భాగ్య పథకంలో డీబీటీ ద్వారా రూ.508.72 కోట్లు, శక్తి పథకంలో రూ.608 కోట్లను విడుదల చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పంచ గ్యారెంటీలను కొనసాగిస్తామన్నారు.


