కబ్జారాయుళ్లపై కొరడా | - | Sakshi
Sakshi News home page

కబ్జారాయుళ్లపై కొరడా

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

సాక్షి బళ్లారి: అధికారం చేతిలో ఉందని, పార్టీ బేధం లేకుండా అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములపై కన్నేసి యథేచ్ఛగా అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయల భూములను కబ్జా చేసినవి ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. రెండు నెలల్లో జిల్లా యంత్రాంగం, సిటీ కార్పొరేషన్‌, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో కబ్జాకు గురైన భూములను ఒక్కొక్కటి స్వాధీనం చేసుకుంటుండటం నగరంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏకంగా పలువురు తమదే భూమి అన్న చందంగా ఇళ్ల స్థలాలుగా ప్లాట్లు వేసి పేద వారికి అమ్మిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాన్ని బాడుగకు ఇచ్చి లక్షలాది రూపాయల మేర నెల నెలా ఆదాయం పొందుతున్న వారూ ఉన్నారు.

రెండు నెలలుగా అధికారుల ప్రత్యేక డ్రైవ్‌

ఈనేపథ్యంలో గత రెండు నెలలుగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించిన అధికారులు, పోలీసులు వివిధ ప్రాంతాల్లో నగరంలో దాదాపు రూ.510 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేసుకొన్న వాటిని స్వాధీనం చేసుకొన్నారు. దాదాపు 110 ఎకరాల భూమిని ఆయా వార్డులు, నగర శివార్లలో మహానగర పాలికె, స్థానిక సంస్థలకు చెందిన భూములను కబ్జాదారుల నుంచి రక్షించి ప్రభుత్వ స్థలం అని నామఫలకాలను ఏర్పాటు చేశారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీలను పీకిపారేశారు. నగరంలోని హవంబావి, నల్లచెరువు, బండిహట్టి, శాంతినగర్‌, రూపనగుడి రోడ్డు, కాకర్లతోట, ఆంధ్రాళ్‌ తదితర ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకొన్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న నేతలకు చెందిన వాటిని కూడా నిర్ధాక్షిణ్యంగా జేసీబీలతో తొలగించి అధికారులు తమ నిజాయితీని నిరూపించుకున్నారు.

జప్తు చేసిన విలువైన భూముల చిట్టా ఇదే..

ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు కబ్జా చేసిన వాటిలో ఇప్పటి వరకు అధికారులు స్వాధీనం చేసుకొన్న వాటిలో ప్రముఖంగా బండిహట్టి ప్రాంతంలో 3.13 ఎకరాలు, హవంబావిలో 25 సెంట్లు, నల్లచెరువు ప్రాంతంలో 3 ఎకరాలు, బత్రి ప్రాంతంలో ఒకటిన్నర ఎకరా, శాంతినగర్‌లో 14 ఎకరాలు, కోట ప్రాంతంలో 40 సెంట్లు, ఆంధ్రాళ్‌లో 49 ఎకరాలు, హవంబావిలో 12 ఎకరాలు, కాకర్లతోటలో మూడున్నర ఎకరాలు తదితర దాదాపు 110 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని దాదాపు 50 మందికిపైగా పలుకుబడి ఉన్న వారు కబ్జా చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

నగర ప్రజల నుంచి హర్షాతిరేకాలు

ఈనేపథ్యంలో రెండు నెలలుగా జిల్లా యంత్రాంగం మెరుపు దాడులు చేసి మహానగర పాలికె పరిధిలోని భూములను స్వాధీనం చేసుకోవడంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ మహానగర పాలికె పరిధిలో బళ్లారి సిటీ, గ్రామీణ నియోజక వర్గాల్లో చాలా మంది భూములను కబ్జా చేసిన వాటిని స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ఇందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నా కచ్చితంగా స్వాధీనం చేసుకోవడంలో వెనుకంజ వేయబోమన్నారు. ఇంకా ఎక్కడెక్కడ కబ్జాకు గురైనవి ఉన్నాయో గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. స్వచ్ఛందంగా అప్పగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

నగరంలో ఆక్రమణలను తొలగిస్తున్న దృశ్యం(ఫైల్‌)

అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చిన దృశ్యం(ఫైల్‌)

రూ.510 కోట్ల విలువైన భూములు స్వాధీనం

ఇప్పటి వరకు చెర వీడిన

110 ఎకరాల భూమి

ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement