రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ హాస్టల్‌లో విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర హాస్టల్ భోజన కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా సాంఘీక సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అడవిరావ్ మాట్లాడారు. సాంఘీక సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం నిష్పత్తిలో వేతనాలను పెంచి ఆదుకోవాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గంగాధర్, నాగమ్మ, సంతోష్, నిరంజన్ కుమార్, బసవరాజ్, తిప్పరాజ్, మేరీ, దేవణ్ణ, రేణుకమ్మలున్నారు.
శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో సరళంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని బీజేపీ నేతలు ఆచరించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు వీరనగౌడ ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ముఖర్జీ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్, జిల్లాధ్యక్షురాలు విజయ రాజేశ్వరి, నగర అధ్యక్షుడు ఊట్కూరు రాఘవేంద్ర, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర జాలదార్‌లున్నారు.
వైభవంగా మారెమ్మ ఉత్సవాలు
రాయచూరు రూరల్: రాయచూరులో మారెమ్మ దేవి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి నగరంలోని హరిజనవాడలో వెలసిన కంచుగడ్డ మారెమ్మ దేవాలయంలో అభిషేకం, పాదుకాపట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. భక్తులు ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. భక్తులు తెల్లవారు జామున ఊయల సేవను చేపట్టారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్, మాజీ నగరసభ సభ్యులు పవన్ కుమార్, యల్లప్ప, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర జాలదార్, భరత్ పాల్గొన్నారు.
బోసురాజుకు
మంత్రి పదవి ఇవ్వండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రివర్గ మలి విస్తరణలో మాజీ మంత్రి, విధాన పరిషత్ సభ్యుడు, సీనియర్ నాయకుడు ఎన్.ఎస్.బోసురాజుకు మరో సారి మంత్రి పదవిని కల్పించాలని కన్నడ సంఘాలు, మైనార్టీ సంస్థలు డిమాండ్ చేశాయి. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు రాము మాట్లాడారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిగా డీ.కే.శివకుమార్‌ను నియమించిన నేపథ్యంలో బోసురాజుకు మంత్రి పదవిని కల్పించాలన్నారు. సీఎం పదవిని చేపట్టిన శివకుమార్ కూడా 50 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించిన బోసురాజుకు కేబినెట్‌లో చోటు ఇవ్వాలని సీఎంకు రాసిన లేఖను స్థానికాధికారికి అందించారు.
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె రోటరీ క్లబ్ ఆఫ్ హంపీ పెర్‌ల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హొసపేటె తాలూకాలోని టీబీ డ్యాం పీఎల్‌సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్‌లు, పెన్నులను పంపిణీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని లలితమ్మ, తాలూకా మధ్యాహ్న వేడి భోజన అధికారి అయ్యప్ప, ఆర్గనైజేషన్ హెడ్ కమల్ గుమాస్తే, అన్నపూర్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, నిర్మల, హేమలత, ఈరప్ప, రవికుమార్, మంజుల, శారద విద్యార్థులు పాల్గొన్నారు.


