రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కళాశాల అధ్యాపకులను హైస్కూలు ఉపాధ్యాయులుగా నియమించి పాఠాలు బోధించాలని జారీ చేసిన ఆదేశాలను పునః పరిశీలించాలని కర్ణాటక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల సమితి సంచాలకుడు నరసప్ప భండారి డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులను హైస్కూలు విద్యార్థులకు పాఠాలు బోధించడానికి వీలుగా ఉపాధ్యాయులుగా నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలన్నారు. రాయచూరు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు.
పథకాలు లబ్ధిదారుల దరి చేర్చాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు, కూలీలకు నరేగ తదితర ప్రభుత్వ పథకాలు సక్రమంగా దరి చేర్చాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ సభాభవనంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి గ్రామ పంచాయతీ అధికారులు ముందుండాలన్నారు. మందకొడిగా కొనసాగుతున్న పథకాలను, అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. జిల్లాలో అపౌష్టికత నివారణ, పిల్లలను పొలం పనులకు పంపకుండా వారిని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శరణ బసవ, విజయ్ కుమార్, నందిని, శరణమ్మలున్నారు.
వ్యక్తిపై దాడి ..
ముగ్గురిపై కేసు
హుబ్లీ: ఉణకల్ వాయుపుత్ర లేఔట్‌లో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలు తీస్తామని బెదిరించిన ముగ్గురిపై విద్యానగర పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కమహాదేవి, గురునాథ, మహాదేవ అనే వారు గంగాధర హుబ్బళ్లిపై దాడి చేసి ప్రాణాలు తీస్తామని బెదిరించినట్లు కేసు నమోదైంది.
డివైడర్‌కు కారు ఢీ.. నలుగురికి గాయాలు
మరో ఘటనలో డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. నుల్వి క్రాస్ వద్ద పుణె, బెంగళూరు రోడ్డులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులతో పాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన సచిన్ కదం, స్వప్నాలితో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయని హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


