హంపీ అభివృద్ధికి కృషి చేస్తా | - | Sakshi
Sakshi News home page

హంపీ అభివృద్ధికి కృషి చేస్తా

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

బళ్లారి ఎంపీ తుకారాం హామీ

హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన హంపీలోని స్మారకాలు, కట్టడాల పరిరక్షణ, పర్యాటక మౌలిక సదుపాయాలు, కన్నడ విశ్వవిద్యాలయం సర్వతోముఖాభివృద్ధిలో తాను పాలు పంచుకుంటానని బళ్లారి ఎంపీ ఈ.తుకారాం హామీ ఇచ్చారు. బుధవారం ఆయన తాలూకాలోని కమలాపుర పురావస్తు మ్యూజియాన్ని సందర్శించి హంపీ సర్కిల్‌లోని వివిధ ప్రాంతాలను తనిఖీ చేశారు. ఆయన కమలాపుర పురావస్తు మ్యూజియం, మహానవమి దిబ్బ, హజారరామ ఆలయం, దానాయక ప్రాంగణం, విరుపాక్ష ఆలయాన్ని సందర్శించి, పర్యాటకుల కోసం సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

మూడు కొత్త అంబారీ బస్సులు

హంపీలో పర్యాటకుల సందర్శన కోసం ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క ఓపెన్‌ అంబారీ బస్సు వ్యవస్థకు అదనంగా, పర్యాటకుల రద్దీని తట్టుకునేందుకు మరో మూడు కొత్త అంబారీ బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహానవమి దిబ్బ ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి, మరుగుదొడ్ల సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హంపీ ఏఎస్‌ఐ, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

హంపీ వర్సిటీ సందర్శన

హంపీ సమీపంలోని కన్నడ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఎంపీ వైస్‌ ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌తో చర్చించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, బోధన సిబ్బంది కొరత వంటి విషయాలను వైస్‌ ఛాన్సలర్‌ ఎంపీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ, కన్నడ విశ్వవిద్యాలయం దేశానికి గర్వకారణమైన సంస్థ అని అన్నారు. ఇక్కడ విద్యా ప్రయోజనాల దృష్ట్యా, ఉపాధ్యాయుల నియామకానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయానికి అవసరమైన ప్రత్యేక గ్రాంటును త్వరలో విడుదల చేయడంపై తాను ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా చర్చిస్తానని, తగిన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement