వీడిన వరుస బైక్‌ చోరీల మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

వీడిన వరుస బైక్‌ చోరీల మిస్టరీ

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

బళ్లారిఅర్బన్‌: బళ్లారి, విజయనగర, చిత్రదుర్గ, అనంతపురం జిల్లాల్లో వరుస బైక్‌ దొంగతనాలకు పాల్పడిన ఓ ఘరానా దొంగను బళ్లారి పోలీసులు అరెస్ట్‌ చేసి అతడి వద్ద నుంచి 41 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి ఎస్పీ సుమన్‌ డీ.పన్నేకర్‌ బుధవారం డీఏఆర్‌ పోలీస్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరుగుప్ప పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన బైక్‌ దొంగతనం కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా హవంబావి ప్రాంతంలో నిందితుడు సిద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కుడితినిలో ఆటో డ్రైవర్‌ అయిన సిద్దారెడ్డి బస్సులో ప్రయాణిస్తూ బస్టాండ్‌, మార్కెట్లు, ఆస్పత్రుల వద్ద పార్కింగ్‌ చేసిన బైక్‌లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసింది. దొంగిలించిన వాహనాలను నకిలీ పత్రాలు, నెంబర్‌ ప్లేట్‌ సహాయంతో తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఏయే జిల్లాల బైక్‌లు ఎన్నెన్ని?

నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న 41 బైక్‌ల్లో బళ్లారికి చెందినవి 15, చిత్రదుర్గకు చెందినవి 21, విజయనగర జిల్లావి 4, అనంతపురం జిల్లాకు చెందిన 1 బైక్‌ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అవసరమైతే మరింత మందిని కూడా అరెస్ట్‌ చేస్తామన్నారు. కేసును చేధించిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి బహుమతిని అందించారు. ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రాంతంలో పార్కింగ్‌ చేయాలని, అదనంగా లాకింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏఎస్పీ నవీన్‌ కుమార్‌, డీఎస్పీ మాలతేష్‌, సిరుగుప్ప సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐ పరశురాం పాల్గొన్నారు.

ఘరానా నిందితుని అరెస్టు

41 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement