బళ్లారి అర్బన్: కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేష్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బళ్లారిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని ఏళుమక్కళ తాయమ్మ దేవస్థానం నుంచి ప్రారంభమైన ర్యాలీ గవియప్ప సర్కిల్ మీదుగా గడిగి చెన్నప్ప సర్కిల్ వరకు సాగింది. అనంతపురం రోడ్డు బీడీఏఏ సభాంగణానికి చేరుకొని పాల్గొన్న వారికి అన్నదానం నిర్వహించారు.
ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జేఎన్ గణేష్ కంప్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. రోడ్లు, తాగునీరు, విద్య, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడంతో పాటు రైతుల సమస్యలను శాసన సభలో సమర్థవంతంగా ప్రస్తావించారన్నారు. సండూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అన్నపూర్ణ విజయం కోసం కీలకంగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. బళ్లారి జిల్లాకు చెందిన ప్రజాదరణ కలిగి యువ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జేఎన్ గణేష్‌కు మంత్రి పదవి ఇస్తే బళ్లారి, విజయనగర జిల్లాల అభివృద్ధికి తోడ్పాటును అందించినట్లు అవుతుందన్నారు.


