భారీగా రేషన్‌ బియ్యం నిల్వ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

భారీగా రేషన్‌ బియ్యం నిల్వ పట్టివేత

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

హొసపేటె: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నభాగ్య పథకం ద్వారా పేదలకు అందించాల్సిన రేషన్‌ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు అక్రమంగా నిల్వ ఉంచి, పేదల పొట్ట కొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం కొప్పళ జిల్లాలో భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం లభ్యం కావడంతో ఈ అనుమానాలు నిజమని తేలింది. తాలూకాలోని కూకనపల్లి గ్రామ శివార్లలో గాళెప్ప అనే వ్యక్తికి చెందిన స్థలంలో భారీ పరిమాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని మునిరాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు రాత్రి ఆలస్యంగా దాడులు నిర్వహించిన పోలీసులకు ఆ భూమిలోని షెడ్డులో బియ్యం బస్తాల కుప్పలు కనిపించాయి.

200 టన్నుల బియ్యం స్వాధీనం

దాడి జరిగిన ప్రదేశంలో సుమారు 1000కి పైగా బియ్యం బస్తాలు లభించాయి. ఆ బస్తాల్లో సుమారు 150 నుంచి 200 టన్నుల మేర బియ్యం ఉంటుందని అంచనా వేశారు. డంప్‌ పట్టుబడిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆహార శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని తనిఖీ చేశారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు కనుగొన్న ఈ డంప్‌ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా ఉందని అనుమానిస్తున్నారు. ఈ భారీ నెట్‌వర్క్‌ వెనుక భూస్వామి గాళెప్ప ఉన్నాడని చెబుతున్నారు. అతని వెనుక పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందిన వెంటనే ఈ దాడి జరిగింది. ఈ విషయమై మునిరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పట్టుబడిన చౌకడిపో బియ్యం బస్తాల నిల్వ

రేషన్‌ బియ్యం నిల్వను పట్టుకున్న అధికారులు

పక్కదారి పడుతున్న చౌక బియ్యం

పేదల పొట్టకొడుతున్న అక్రమార్కులు

Advertisement
 
Advertisement
Advertisement