మహిళా బిల్లుకు మోకాలడ్డు హేయం | - | Sakshi
Sakshi News home page

మహిళా బిల్లుకు మోకాలడ్డు హేయం

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

సాక్షి,బళ్లారి: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ వెంటనే అమలు చేయాలని మహిళలు కదం తొక్కారు. శనివారం సాయంత్రం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులు, హిందూ, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు, మంగళముఖిలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆందోళన చేపట్టారు. కనక దుర్గమ్మ ఆలయం నుంచి రాయల్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. రాయల్‌ సర్కిల్‌ వద్ద మానవహారం ఏర్పాటు చేసి మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలనే నినాదాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 1996లో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. 30 సంవత్సరాలుగా ఎందుకు కాలయాపన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్‌ అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలపై చిన్నచూపు తగదు

మహిళలు అంటే అంత చులకనగా చూస్తుండటం సరికాదన్నారు. బీజేపీ నేతృత్వంలో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లును కాంగ్రెస్‌, ఇతర పార్టీలు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. మారుతున్న కాలానుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. పురుషులతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొంది దేశాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ, విధాన పరిషత్‌ లాంటి ప్రముఖ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. 2023లో అమలు చేసిన ఈ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకోవడం ఆ పార్టీ పతకానికి పరాకాష్ట అన్నారు.

మహిళల శాపానికి గురి కాక తప్పదు

జిల్లా మహిళా మోర్చా బీజేపీ అధ్యక్షురాలు హంపీ రమణ మాట్లాడుతూ మహిళల కోసం చట్ట సభల్లో రిజర్వేషన్‌ తక్షణం అమలు చేయాలని, 2029 సార్వత్రిక ఎన్నికల్లోపు బిల్లును అమలు చేసి కార్యరూపం దాల్చాలని లేక పోతే మహిళల శాపానికి గురి కావాల్సి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేసేందుకు అన్ని పార్టీలు సహకారం అందించాలని ఒత్తిడి చేశారు. మహిళలను ఎక్కడ గౌరవించి, పూజిస్తారో అక్కడ దేవతలు కొలువుంటారని మన పెద్దలు ఘోషిస్తున్న నేపథ్యంలో మహిళలు రాజకీయంగా ఎదగడానికి ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మహిళలు రాజకీయంగా రాణించడం కాంగ్రెస్‌ పార్టీకి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. కార్పొరేటర్‌ సురేఖ, మహిళ మోర్ఛా బీజేపీ పదాధికారులు అలివేలమ్మ, సాధన హిరేమట్‌్‌, భాగ్యలక్ష్మి, పుష్ప, డాక్టర్‌ రేణుకా, గాయత్రి రెడ్డి, చాందిని తదితరులు పాల్గొన్నారు.

33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

గనినాడులో కదం తొక్కిన నారీమణులు

Advertisement
 
Advertisement
Advertisement