హుబ్లీ: రాష్ట్రంలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండల నుంచి ప్రజలకు కలిగే ఇబ్బందులు, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చే వడదెబ్బ రోగులకు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా 10 పడకలతో వార్డును సిద్ధం చేశారు. హీట్‌స్ట్రోక్, డీహైడ్రేషన్‌తో బాధ పడేవారికి ఏసీ గదిలో పడకల వసతి కల్పించారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఇచ్చిన సూచనల మేరకు పడకలను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల కోసం ఇప్పటికే ప్రత్యేక వార్డు ఉండగా ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వారికి చికిత్సలు అందిస్తున్నారు.
పురుషులు, మహిళలకు చెరిసగం పడకలు
మండుతున్న ఎండలకు ఇప్పటికే పేడానగరి ప్రజలు చల్లని పానీయాలను ఆశ్రయిస్తున్నారు. చాలా వరకు ఎండల వల్ల అనారోగ్యం కలిగే ప్రమాదం ఉండటంతో అత్యవసర చికిత్స కోసం ఈ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఈ విషయమై ఆ జిల్లా ఆస్పత్రి సర్జన్ డాక్టర్ సంగప్ప గావి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ఏర్పాట్లు చేశామన్నారు. 10 పడకలు సిద్ధం చేశాం. సగం పురుషులకు, సగం మహిళలకు, అలాగే ప్రత్యేకించి పిల్లలకు వేరే పడకలు కేటాయించాం.
వడదెబ్బ లక్షణాలు ఉంటే ఆస్పత్రికి రావాలి
ప్రజలు వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు. ఈ విభాగానికి ప్రత్యేకంగా డాక్టర్ కిరణ్ కుమార్‌ను నోడల్ అధికారిగా నియమించాం. అలాగే అవసరమైన సిబ్బందిని కూడా సిద్ధం చేశాం. జిల్లాధికారి పూర్తి స్థాయిలో ఆసక్తితో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది.
జిల్లా ఆస్పత్రిలో 10 పడకలతో
ప్రత్యేక వార్డు ఏర్పాటు
హీట్‌స్ట్రోక్, డీహైడ్రేషన్‌తో
బాధ పడేవారికి అందుబాటులో చికిత్స


