రాయచూరు రూరల్: యాదగిరిలో రూ.వంద కోట్లతో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నిర్మాణనికి చర్యలు తీసుకుంటామని యాదగిరి శాసన సభ్యుడు చెన్నారెడ్డి పాటిల్ తన్నూరు వెల్లడించారు. ఆదివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం యాదగిరి నూతన జిల్లాగా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. నేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు నూతనంగా ఆస్పత్రి నిర్మాణాలు చేపడుతామన్నారు. బీమా నది నుంచి నగరానికి తాగునీరు సరఫరా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ప్రధాన రహదారులకు మరమ్మతులు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, నగర సభ కమిషనర్ ఉమేష్, నేతలు చెన్నకేశవ గౌడ, తిమ్మణ, సాయిబణ్ణ, శరణే గౌడ, శరణమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రహదారుల మరమ్మతుకు చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: రాయచూరు యాదగిరి, హైదరాబాద్, బెళగావి, బెంగళూరు శ్రీరంగపట్నం జాతీయ రహదారుల మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం యాదగిరి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకుడు మల్లన గౌడ మాట్లాడుతూ.. ఇటీవల సురుపుర వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. శాసన సభ్యులు, లోకసభ సభ్యులు, మంత్రులు లింగసూగురు మీదుగా బీదర్, కలబుర్గి, యాదగిరి జిల్లాల మీదుగా ప్రయాణాలు చేస్తుంటారన్నారు. రహదారి మరమ్మతుల గురించి పట్టించుకున్న దాఖలాలు వేవన్నారు. రహదారి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ పృథ్వీ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు.
22 నుంచి వాసవీ జయంత్యుత్సవాలు
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 22 నుంచి 26 వరకూ వాసవీ మాత జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సమాజం అధ్యక్షుడు పురుషోత్తం తెలిపారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని ఆర్యవైశ్య సభ్యుల ఆధ్వర్యంలో నగరేశ్వర దేవస్థాన నిర్మాణం పూర్తి కాబడి దశాబ్దం అయ్యిందన్నారు. 22న ధ్వజారోహణం, వాసవీ మాతకు పూజలు, సింహ వాహనంపై అమ్మవారి ఊరేగింపు, 23న తొట్టెల సేవ, గజ వాహనోత్సవం, 24న అశ్వ వాహనోత్సవం, 25న కామదేను, కల్పవృక్ష వాహన ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 26న వాసవీ జయంతి సందర్భంగా వెండి, స్వర్ణ రథోత్సవాలు జరుపుతామన్నారు. సమావేశంలో పద్మరాజ్, జగదీష్, వీరేష్, వెంకణ్ణ, గోవిందు, దత్తాత్రేయ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
11కు చేరిన
మృతుల సంఖ్య
● మంత్రాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం
సాక్షి, బళ్లారి: మంత్రాలయం శ్రీగురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. చిక్కమగళూరు జిల్లా బేలూరు తాలూకా శెట్టిగేరె కుటుంబానికి చెందిన 18 మందికి పైగా మంత్రాలయానికి వాహనంలో బయలుదేరారు. మరికొన్ని నిమిషాల్లో మంత్రాలయం చేరుకునే లోపు జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తాజాగా చికిత్స పొందుతూ మరో ఇద్దరు జయమ్మ (65), శోభ (35) మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరినట్లు స్థానికులు తెలిపారు. మృతుల కుటుంబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన 11 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


