సీటీ రవిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కోలారు: మాజీ మంత్రి , బీజేపీ నేత సీటీ రవిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జిల్లాకాంగ్రెస్ సమితి వెనుక బడిన వర్గాల విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం ఎస్పీ నిఖిల్‌ను కలిసి వినతిత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ సీటీ రవి చిక్కమగళూరు మెడికల్ కళాశాలలో ఓ సముదాయాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలోఅశోక్‌కుమార్, లక్ష్మీనారాయణ, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దును తొలగిస్తే అంతే
కోలారు: సీఎం సిద్దరామయ్యను పదవి నుంచి దించితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధఃపాతాళానికి చేరుతుందని మాజీ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ అన్నారు. ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. సిద్దరామయ్యను తొలగిస్తే 25 లక్షల మంది కురుబ సముదాయ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారని చెప్పారు. కురుబలు, అహింద సముదాయం ఐకమత్యంగా ఉండడం వల్లనే సిద్దరామయ్య జోలికి వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారన్నారు.
కడ్లె గౌరమ్మ నిమజ్జనం
హుబ్లీ: కర్ణాటక, ఉమ్మడి ఆంధ్ర సరిహద్దున గల విడపనకల్లులో వెలసిన కడ్లె గౌరమ్మ నిమజ్జన వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఏటా కార్తీక పౌర్ణమి తర్వాత ఈ వేడుక నిర్వహిస్తారు. బళ్లారి, అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా ఉద్దేహాల్, బొమ్మనహాల్, శ్రీధరగడ్డ, ఉంతకల్లు, కణేకల్లు, ఉరవకొండ తాలూకాల్లో గౌరమ్మ వేడుకలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో గౌరమ్మకు పూజలు జరిపారు. విడపనకల్లులో మాత్రం కడ్లెగౌరమ్మ నిమజ్జనం ఘనంగా సాగింది. అమ్మవారి బావిలో నిమజ్జనం కాగానే ఇటు కోడి, పొట్టేలు మాంసం ఎగబడి కొనుగోలు చేశారు. బంధు మిత్రులతో కలిసి జాతరలో పాల్గొన్నారు.
రైతుల పోరుబాట
హుబ్లీ: రాష్ట్రంలో సిద్ధరామయ్య సర్కారు నిర్లక్ష్యంతోనే చెరకు రైతులు పోరుబాట పట్టారని మాజీ సీఎం బెళగావి జగదీశ్ శెట్టర్ మండిపడ్డారు. నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి అన్నదాతలపై ఇసుమంతైన శ్రద్ధ లేదని, ధరకోసం పోరాడే వారిని అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల తీవ్ర పోరాటంతో కొంత ఉపశమనం కలిగినా.. ధర పెంపు నిర్ణయానికి ఇంకా ఆమోదం తెలపలేదన్నారు.
మహిళ ఆత్మహత్య
క్రిష్ణగిరి: అనుమానాస్పద స్థితిలో మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. వివరాల మేరకు తిరుపత్తూరు జిల్లా చిన్న వెంగాయంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (41). క్రిష్ణగిరి జిల్లా బర్గూరు సమీపంలోని మట్టారంపల్లి ప్రాంతంలో నివాసముంటూ అక్కడే పండ్ల రసాల ఫ్యాక్టరీలో పనిచేసేది. ఆదివారం ఉదయం గదిలో ఉరివేసుకొన్న స్థితిలో శవమైంది. పోలీసులు శవాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై విచారణ జరుపుతున్నారు.


