74 చెరువులను నీటితో నింపుతాం
హొసపెటె: రూ.870 కోట్లతో 74 చెరువులను నీటితో నింపే ప్రాజెక్టును చేపట్టినట్లు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కూడ్లిగి నియోజకవర్గంలో ఆ ప్రాజెక్టు పనులతోపాటు, రూ.1750 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం ఆదివారం శంకుస్థాపన చేశారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ కూడ్లిగి బంజరు భూమిలో పచ్చదనం నింపేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్ కృషి చేశారని ప్రశంసించారు. గృహలక్ష్మి, గృహ జ్యోతి, ఇతర ప్రయోజనాల ద్వారా 1.20 కోట్ల కుటుంబాల యజమానులకు లక్షల కోట్ల రూపాయలు నేరుగా జమ చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలపై బీజేపీ అబద్ధాలను పంచుతోందన్నారు. సిగ్గు లేకుండా కొందరు ఓటు చోరీకి పాల్పడి పట్టుబడ్డారని అన్నారు. చెరకు రైతులకు ఎంఆర్‌పీ, ఎంఎస్‌పీ ధరను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రహ్లాద్ జోషి చెరకు రైతులకు ద్రోహం చేశారని విమర్శించారు. విజయేంద్ర బెల్గాం వెళ్లి నిరసన నాటకం సృష్టించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని దాచిపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరకు రైతులకు రక్షణ కల్పించడానికి కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మంత్రులు సతీష్‌జారికి హొలె, జమీర్ అహమ్మద్‌ఖాన్, సంతోష్‌లాడ్, సుధాకర్, బోసురాజ్, ఎంపీ తుకారాం, ఎమ్మెల్యేలు డాక్టర్.శ్రీనివాస్, లతా మల్లికార్జున, బీఎం నాగరాజ్ గోపాల్ కృష్ణ మాజీ మంత్రులు అల్లం వీరభద్రప్ప, ఆంజనేయులు, జిల్లాధికారి కవితా ఎస్‌మన్నికేరి, తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి
సిద్ధరామయ్య
74 చెరువులను నీటితో నింపుతాం


