హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయం ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు యథావిధిగా కొనసాగుతుండటంతో డ్యాంకు వరద పోటెత్తుతోంది. మంగళవారం డ్యాంలో నీటినిల్వ 78.284 టీఎంసీలకు చేరుకోగా డ్యాం వద్ద 20 క్రస్ట్‌గేట్లలో కొన్ని గేట్లను 2.5 అడుగులు, మరికొన్ని గేట్లను 3 అడుగులు, 3.5 అడుగులు, ఇంకొన్ని గేట్లను 4 అడుగులు, 4.5 అడుగులు, 13 గేట్లను ఐదు అడుగుల చొప్పున పైకెత్తి దిగువకు సుమారు 95 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంకు వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. డ్యాంలో నీటిమట్టం 1624.62 అడుగులు, ఇన్‌ఫ్లో 1,09,175 క్యూసెక్కులు ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపారు.
పిల్లలకు పాలు పంపిణీ
రాయచూరు రూరల్: శ్రావణ మాస నాగ పంచమి వేడుకల్లో భాగంగా మంగళవారం పిల్లలకు పాలు పంపిణీ చేశారు. నగరంలోని అంబేడ్కర్ నగర్‌లో మురికి వాడల సంఘం, రవి పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు జనార్దన్ పిల్లలకు పాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాములు పాలు తాగవని అన్నారు. నాగ ప్రతిమలకు, పుట్టలకు పాలు పోసే బదులు రాష్ట్రంలో అపౌష్టికతతో నలిగి పోతున్న చిన్నారుల మేలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లక్ష్మణ్, అనిల్ కుమార్, బసవరాజ్, ప్రసాద్, జంబణ్ణ, మాధవరెడ్డి, రాజు, పద్మావతిలున్నారు.
ఆఫ్‌లైన్‌లో ప్రవేశాల
గడువు పొడిగింపు
హుబ్లీ: విద్యానగరి ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26వ విద్యా సంవత్సరానికి గాను ప్రాథమిక, ల్యాటరల్ ఎంట్రీ ద్వారా మూడవ సెమిస్టర్‌లో ప్రవేశానికి మిగిలిన సీట్లకు ఆఫ్‌లైన్ ద్వారా ప్రవేశం పొందడానికి ఆగస్టు 11 వరకు గడువు పొడిగించారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ఈ అండ్ సీ, సివిల్, సీపీ, ఇంగ్లిష్, సీపీ కన్నడ కోర్సుల్లో మిగిలిన సీట్లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు దరఖాస్తు నమూనా, వివరాలకు కర్ణాటక పరీక్ష ప్రాధికార, సాంకేతిక విద్యాశాఖ అధికారిక వైబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి. భర్తీ చేసిన దరఖాస్తును స్వయంగా సదరు కళాశాలలో మూల రికార్డులతో ప్రవేశ శుల్కం, ఓ సెట్ స్వయం ధృవీకరణ జిరాక్స్ ప్రతులతో ఆగస్టు 11లోగా దరఖాస్తులను అందించాలని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో కోరారు.
బంగారు ఆభరణాలు,
నగదు చోరీ
హుబ్లీ: అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హర్ష రెసిడెన్సీ ప్రదీప్ అనే వ్యక్తి ఇంట్లో లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైన ఘటన చోటు చేసుకుంది. ఇంటి దగ్గర దాచి పెట్టిన తాళం చెవిని తీసుకున్న చోరులు ఇంటి తలుపును తెరిచి ఇంట్లో ఉన్న 42 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.83 వేల నగదు చోరీ చేసినట్లు బాధితుడు విద్యానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైభవంగా నాగ పంచమి
రాయచూరు రూరల్: శ్రావణ మాసం మహిళలకు వ్రతాలు, నోములు, పండుగలకు ప్రసిద్ధి. ఈనేపథ్యంలో మంగళవారం నాగ పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. నగరంలోని నాగేష్ కట్ట వద్ద నాగ ప్రతిమలు, పుట్టలకు మహిళలు పాలు పోసి తమ కోర్కెలు తీర్చాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు.
వేడుకగా శ్రీవారి కళ్యాణోత్సవం
రాయచూరు రూరల్ : నగరంలో నాలుగు రోజుల పాటు జరిగే శ్రీవారి కళ్యాణోత్సవం ఆరంభమైంది. మంగళవారం నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో వెలసిన వేంకటేఽశ్వర స్వామి పవిత్రోత్సవ సేవలకు నారాయణపేట మాజీ శాసన సభ్యుడు ఎస్. రాజేంద్రరెడ్డి దంపతుల పట్టు వస్త్రాలతో ఆలయానికి తరలి వచ్చారు. ఉదయం సుప్రభాత సేవలు, పరిమళ ఆరాధన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నెరవేర్చారు.
కొనసాగిన తుంగభద్ర పరవళ్లు
కొనసాగిన తుంగభద్ర పరవళ్లు
కొనసాగిన తుంగభద్ర పరవళ్లు