
కళ్యాణ కర్ణాటకలో ఎరువుల కొరత
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోని కలబుర్గి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, బీదర్, యాదగిరి, విజయనగర, బాగల్‌కోటె వంటి జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత అధికమైంది. సోమవారం కొప్పళలో రైతులు ఎరువుల దుకాణాల ముందు నిలబడినా ఫలితం లేకపోవడంతో రైతు నోటిలో మట్టి వేసుకొని నిరసన వ్యక్తం చేసిన ఘటన అందరి కళ్లలో నీరు తెిప్పించింది. యూరియా, డీఏపీ ఎరువుల కోసం 44 సహకార సంఘాల్లో రైతులు ఎదురు చూస్తున్నారు. రాయచూరు ఏపీఎంసీకి 50 టన్నుల యూరియా వచ్చినట్లు వచ్చి ఖాళీ అయింది. రాయచూరు జిల్లాకు 72 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా కేవలం 900 మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేశారు. జిల్లాలో యూరియా లభించక పోవడంతో రైతులు వాటి కోసం వలసలు వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల, మక్తల్, నారాయణ పేట, కృష్ణా, మాగనూరు, ఆంధ్రప్రదేశ్‌లోని మాధవరం, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాలకు వెళ్లి రైతులు పంటల సంరక్షణకు 50 కేజీల బస్తాకు రూ.50 అదనపు ధర పెట్టి కొనుగోలు చేసుకుంటున్నారు.
ఎరువులను అందుబాటులో ఉంచండి
హొసపేటె: ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు రైతులకు అవసరమైన యూరియా ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, గ్రీన్ ఆర్మీ( హుచ్చవ్వనహళ్లి మంజునాథ్ బణ) మంగళవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రీన్ ఆర్మీ దేవరమని మహేష్, రాష్ట్ర సహ ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్, జిల్లా అధ్యక్షుడు బణకార్ బసవరాజ్, బళ్లారి జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, తాలూకా అధ్యక్షుడు బాణద మారుతి, గ్రీన్ ఆర్మీ తాలూకా అధ్యక్షుడు బీఎం.నవీన్ కుర్మ, ఉపాధ్యక్షుడు ఎండీ ఫయాజ్, కోశాధికారి హేమంత్, హొంబాళె రేవణ్ణ, గుప్పల్ కరప్ప, ఓబన్న పాల్గొన్నారు.
రైతన్నలకు తప్పని ఎరువుల తిప్పలు
ఎరువుల కోసం రైతుల వలసలు

కళ్యాణ కర్ణాటకలో ఎరువుల కొరత