
లాల్‌బాగ్.. నో షూటింగ్
బనశంకరి: అంతటా పచ్చని చెట్లు, పొదలతో ఉద్యాన నగరికి తనమానికమైన లాల్‌బాగ్ ఉద్యానవనంలో వివిధ సందర్భాల పేరుతో జంటలతో జోరుగా ఫోటో షూట్లు జరుగుతుంటాయి. యువత రీల్స్, వీడియోలతో నానా రచ్చ చేస్తుంటారు. ఇక పసికందులు, చిన్నారులతోనూ ఫోటోషూట్లు ఉంటాయి. ఇకముందు ఇవన్నీ కుదరకపోవచ్చు. ఉద్యానంలో ఈ తరహా షూటింగ్‌లకు అడ్డకట్ట వేయడానికి ఉద్యానవనశాఖ సిద్ధమైంది. గత కొద్దిరోజుల క్రితం కబ్బన్‌పార్కులో రీల్స్, సినిమా, బుల్లితెర, ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ తో పాటు ఇతరత్రా చిత్రీకరణలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే మాదిరిగా లాల్‌బాగ్‌లోనూ అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన అందజేయనున్నట్లు ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు.
ప్రశాంతత ముఖ్యం
లాల్‌బాగ్ ఉద్యానవనంలో అందమైన తోటలు, మొక్కలు, చెట్లు పూర్తి సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది జీవ వైవిధ్యంతో కూడిన నిలయం కావడంతో ప్రాణులు పక్షులు స్వేచ్ఛగా నివసించడానికి తావుండాలి. ఉద్యానవనంలో సందర్శకులకు ప్రశాంతత లభించేలా చిత్రీకరణలను బంద్ చేయాలని ఉద్యానవనశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.జగదీశ్ తెలిపారు.
షూట్లతో సమస్యల గోల
లాల్‌బాగ్‌లో చెట్లు, పొదల్లో తేనెతుట్టెలు చాలా ఉన్నాయి. అక్కడ ఫోటోలు తీసే సమయంలో సందడికి అవి హైరానా పడవచ్చు. ఫ్లాష్ లైట్లతో ఇబ్బంది కలిగి జనం దాడిచేసే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్స్ సమయంలో సార్వజనిక స్థలం అనేది మరచిపోయి అర్ధనగ్నంగా సంచరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని గతంలో ఆరోపణలున్నాయి. పార్కుకు అనేక వయసులవారు వస్తుంటారు. అలాంటి వారికి అవస్థలు కలిగించరాదని నిర్ణయించారు. మొక్కలు, చెట్లపై కూర్చుని ఫోటో, వీడియో తీయడంతో చెట్లు దెబ్బతింటాయి. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.
ఫొటోషూట్ల నిషేధానికి ప్రయత్నాలు
సందర్శకుల ఉల్లాసానికి ప్రాధాన్యం
నిపుణుల కమిటీ తీర్మానం
ప్రముఖ పరిసరవాది డాక్టర్ యల్లప్పరెడ్డి అధ్యక్షతన పరిసరవాదులు, ఉద్యానవనశాఖ శాస్త్రవేత్తలతో కూడిన సలహా సమితి ఈ విషయంపై చర్చించింది. ఫోటోషూట్లకు అనుమతి ఇవ్వాల్సిన ప్రదేశాలు, ఇవ్వకూడనివి, నిషేధించాల్సిన కార్యకలాపాలు తదితరాల గురించి చర్చించారు. మరోసారి భేటీ అయిన నిబంధనల జాబితా రూపొందిస్తారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని జగదీశ్ తెలిపారు.

లాల్‌బాగ్.. నో షూటింగ్

లాల్‌బాగ్.. నో షూటింగ్

లాల్‌బాగ్.. నో షూటింగ్

లాల్‌బాగ్.. నో షూటింగ్