
కోస్తా తీర ప్రాంతాల్లో కుండపోత
శివాజీనగర: నైరుతీ రుతు పవనాలు జోరు మీదున్నాయి. మలెనాడు, కరావళి, ఉత్తర కర్ణాటక కొన్ని భాగాల్లో వానలు కురుస్తున్నాయి. దక్షిణ ఒళనాడులో కొన్ని చోట్లలో భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. చిక్కమగళూరు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, కొడుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్?
● హావేరి, బెళగావి, ధారవాడ, హాసన్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, అధికారులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది.
● వారం నుంచి రాష్ట్రంలో ఖరీఫ్ వర్షాలు చురుకుగా ఉన్నాయి. బెంగళూరు ప్రాంతీయ కేంద్ర సమాచారం ప్రకారం మంగళూరులో 9 సెం.మీ., ఉడుపిలో 8 సెం.మీ., ఉప్పినంగడి, గేరుసొప్ప, భట్కళ, పణంబూరు, బసవన బాగేవాడి, బెళ్లంగడిలలో 7 సెం.మీ. చొప్పున కుండపోత వానలు కురిశాయి. సిద్దాపుర, కుందాపుర, గోకర్ణ, పుత్తురులలో 6 సెం.మీ.చొప్పున, మూడుబిద్రి, కార్కళలో 5 సెం.మీ. చొప్పున వర్షం పడింది.
● దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక భాగంలో సాధారణ వర్షం కురిసింది. ఆకాశం మబ్బులు కమ్మింది.
● బెంగళూరు చుట్టుపక్కల జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. పగటి వెలుతురు తగ్గి, అప్పుడప్పుడు చల్లని బలమైన గాలులు వీస్తున్నాయి. బెంగళూరు పరిసరాల్లో సాధారణ వర్షం కురిసే అవకాశముంది.
రేవు నగరం అతలాకుతలం
మంగళూరులో ముంపు సమస్య ఏర్పడింది. పగలూ రాత్రి ఏకధాటి వానతో శనివారం పలు ప్రాంతాలలో ఇళ్లలోకి వాననీరు చేరింది. కోడియాలగుట్టులో అనేకమంది నివాసితులను సహాయక సిబ్బంది రబ్బరు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్తావరలో ఓ చోట డ్రైనేజీ కాలువ కింద మట్టి కొట్టుకుపోయి కాలువ ధ్వంసమైంది. కొడగు జిల్లాల్లో నదులకు ప్రవాహం అధికమైంది. హారంగి డ్యాం నుంచి 4 గేట్లను ఎత్తి 4 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో సిర్సి రోడ్డులో దేవిమనె ఘాట్ వద్ద కొండచరియలు కూలిపోయి రవాణాకు ఆటంకం ఏర్పడింది.
మంగళూరులో పలు ప్రాంతాల
జలమయం
బెంగళూరుకూ వర్షసూచన

కోస్తా తీర ప్రాంతాల్లో కుండపోత