
కరావళిలో వరుణ ప్రతాపం
యశవంతపుర: కరావళిలోని బెళగావి జిల్లా వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయి. అనేక చోట్ల అంతరాయాలు కలిగాయి, ఇంటి గోడ కూలి వృద్ధుడు మృతి చెందగా, నిండుగా ప్రవహిస్తున్న కాలువ నీటిలో ఆటో కొట్టుకుపోయిన ఘటనలో వ్యక్తిని గ్రామస్థులు రక్షించారు. బెళగావి జిల్లా గోకాక్ తాలూకా చిక్కనంది గ్రామంలో మట్టిగోడ కూలి ఫకీరప్ప లక్ష్మణ హావేరి(65) మృతి చెందారు. మట్టిలో చిక్కుకున్న ఫకీరప్పను గ్రామస్థులు బయటకు తీశారు. అయితే అప్పటికే ఊపిరాడక ఆయన మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోకాక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గోకాక్ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
ఆటోడ్రైవర్ రక్షణ
యరగట్టి తాలూకా చిక్కబూదనూరు గ్రామ సమీపంలో గురువారం రాత్రి నిండుగా ప్రవహిస్తున్న కాలువలో ఆటోను దాటించే ప్రయత్నంలో నీటి ప్రవాహానికి ఆటోతో పాటు డ్రైవర్ కొట్టుకుపోయారు. అయితే గమనించిన స్థానికులు తక్షణమే తాడు సాయంతో డ్రైవర్‌ను రక్షించారు. మురగోడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
భారీ వర్షాలు
బెళగావి జిల్లా బైలహొంగల, సవదత్తి, గోకాక్ తాలూకాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీగా వర్షం కురిసింది. వానలతో కుంటలు నిండి చెరువుల్లోకి నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచి సమస్యలు ఎదురయ్యాయి. భారీ వానలతో బైలహొంగల పట్టణంలోని ఒక క్లినిక్‌లోకి నీరు చొరబడ్డాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా పట్టణంలోని అనేక ఇళ్లలోకి నీరు చేరాయి.
కార్వారలోనూ..
రెండు రోజుల నుంచి ఉత్తర కన్నడ జిల్లా కార్వారలో భారీగా వానలు పడుతున్నాయి. జాతీయ రహదారి–66లో మట్టి చరియలు విరిగి పడ్డాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కారవార నగర టన్నెల్ భాగం, బిణగా మార్గంలో మూడు చోట్ల మట్టి రోడ్డుపై కూలింది. గోవా–కారవార–మంగళూరు మార్గంలో వాహనాల సంచారానికి ఆంక్షలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 19 మార్గాల్లో జిల్లా యంత్రాంగం వాహనాల రాకపోకలపై నిర్భంధం విధించింది. ఉత్తర కన్నడ జిల్లాలో ముంగారు వానలు భారీగా పడుతుండటంతో జిల్లాలో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు.
బెళగావి, కార్వార జిల్లాల్లో భారీ వానలు
గోకాక్ తాలూకాలో గోడ కూలి
వృద్ధుడి మృతి

కరావళిలో వరుణ ప్రతాపం