విత్తనాల కోసం రైతుల పడిగాపులు ●
● అనంతపురం, కర్నూలు జిల్లాల
నుంచి రైతుల రాక
బళ్లారి రూరల్ : తొలకరి వానలు ఆరంభమైన తరుణంలో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం పొలాలను దున్ని విత్తనాలు సిద్ధం చేసుకొనే క్రమంలో కంది విత్తనాల కోసం బళ్లారి నగరంలోని కేసీ రోడ్డులో విత్తనాల దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాశారు. కేసీ రోడ్డులోని ఓ దుకాణం వద్ద నాణ్యమైన ధనలక్ష్మి కంది విత్తనాలు లభ్యమౌతాయని అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, కూడేరు, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని పరిసర ప్రాంతాల నుంచి రైతులు ఉదయాన్నే దుకాణం వద్ద వేచి ఉన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయని ఉదయాన్నే దూర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలిపారు.
ఐఎఫ్‌ఎస్‌లో
జిల్లావాసికి 41వ ర్యాంక్
రాయచూరు రూరల్: భారత అటవీ సేవ(ఐఎఫ్‌ఎస్) పరీక్షల్లో రాయచూరు జిల్లా వాసికి దేశానికే 41వ ర్యాంక్ లభించింది. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా కరడకల్‌కు చెందిన ఆనంద్ కుమార్ నాగరాళ లింగసూగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బసవరాజ్ కుమారుడు. యూపీఎస్‌సీ పరీక్షలకు బెంగళూరు, న్యూఢిల్లీల్లో కోచింగ్ పొంది ఇటీవల వెలువడిన ఐఎఫ్‌ఎస్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకు సాధించి జిల్లాకు కీర్తిని గడించారు.
గ్యాంగ్ రేప్ కేసులో
ఏడుగురికి బెయిల్
హుబ్లీ: హావేరి జిల్లా హానగల్‌లో సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితులైన 7 మందికి అక్కడి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో 19 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 10 నెలల క్రితం 12 మంది నిందితులు బెయిలు పొంది హావేరి సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా 7 మంది నిందితులు అఫ్తాబ్, మదార్ సాబ్ మండక్కి, షమీ ఉల్లా, మహమ్మద్ సాదిక్, షోయబ్ ముల్లా, తౌసిఫ్ బోటి, రియాజ్ సాదికేరిలకు కోర్టు బెయిలు మంజూరు చేసింది.
పునర్నియామకంపై హర్షం
బళ్లారిఅర్బన్: జిల్లాలోని ప్రముఖ విద్యా సంస్థ వీరశైవ విద్యావర్థక సంఘం, వీరశైవ కళాశాల పాలక మండలి అధ్యక్షుడిగా శాంతనగౌడ ధార్వాడ హైకోర్టు ఆదేశం మేరకు పునర్నియామకం అయ్యారు. ఈ మేరకు ఆయన సదరు కళాశాల పాలక మండలి కార్యాలయంలో అధికార బాధ్యతలు చేపట్టారు. కొన్ని కారణాలతో సదరు సంఘం శాంతనగౌడను అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ పదవిలో సాహుకార్ సతీష్ బాబును నియమించింది. దీన్ని ప్రశ్నిస్తూ శాంతనగౌడ ధార్వాడ హైకోర్టు నుంచి నిలుపుదల ఆదేశాలు తెచ్చుకోవడంతో తిరిగి ఆయన అధ్యక్షుడిగా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా శాంతనగౌడను మిత్రులు తదితరులతో పాటు ఆ సంఘం సభ్యులు అభినందించారు.
తిమ్మప్ప సేవలు చిరస్మరణీయం
బళ్లారి అర్బన్: రాఘవ మెమోరియల్ అసోసియేషన్ స్థాపనతో పాటు అభివృద్ధికి ఎంతో కృషి చేసిన దివంగత కాకర్లతోట కనుగోలు తిమ్మప్ప సామాజిక సేవలతో పాటు కళా సేవలు చిరస్మరణీయం అని జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్ రాజ్ నాగిరెడ్డి తెలిపారు. కాకర్లతోట తిమ్మప్ప 25వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. రాఘవ కళా మందిరం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు అవ్వారు మంజునాథ్, సురేష్‌బాబు, దొడ్డనగౌడ, సొంతా గిరిధర్, డాక్టర్ మర్చేడ్ మల్లికార్జున గౌడర, రామచంద్ర, కే.చెన్నప్ప, కే.శ్యామ్, సురేంద్ర కుమార్ బాగ్నే తదితరులు పాల్గొని కాకర్లతోట తిమ్మప్పకు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఏపీఎంసీ ఆవరణలో ఉన్న జిల్లా వాణిజ్య, పరిశ్రమల సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఆస్పత్రిలో రోగులకు విశేషంగా వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
విత్తనాల కోసం రైతుల పడిగాపులు ●
విత్తనాల కోసం రైతుల పడిగాపులు ●
విత్తనాల కోసం రైతుల పడిగాపులు ●


