రమణీయం.. రోకలి కరగ
మాలూరు: తాలూకాలోని కుడియనూరు గ్రామంలో శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపదాంబ దేవి దేవాలయంలో కరగ ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఒనకె (రోకలి) కరగ ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 6 అడుగుల పొడవు ఉన్న రోకలిని తలపై నిలిపి దాని మీద రాగి పాత్రను నీటితో నింపి కరగ పూజారి మంజునాథ్ నృత్యమాడారు. సుమారు గంటకు పైగా నిర్వహించిన రోకలి కరగ నృత్యాన్ని చూస్తూ భక్తులు మైమరిచారు. ఆలయం పరిసరాలలో జాతర సందడి నెలకొంది.
సిందూర్‌ను కించపరచొద్దు
మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషంతోనే కాంగ్రెస్ నాయకులు ఆపరేషన్ సిందూర్ గురించి తేలికగా మాట్లాడుతున్నారు అని మైసూరు బీజేపీ మాజీ ఎంపీ ప్రతాప్ సింహ ఆరోపించారు. మైసూరులో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ చిన్నయుద్ధమని ఏఐసీసీ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ చెప్పడం సరికాదన్నారు. ఆపరేషన్ విజయవంతమైంది. ఎన్ని విమానాలు పోయాయి అంటున్నారు, నువ్వు చైనా, పాకిస్తాన్ ఏజెంటా అని ధ్వజమెత్తారు. ఇప్పుడు చైనా ఆయుధాలను కొనడానికి ఎవరూ రావడం లేదన్నారు. భారతదేశ బ్రహ్మోస్ క్షిపణికి 14 దేశాలు నుండి డిమాండ్ వచ్చిందని చెప్పారు.
మెట్రో చిక్స్ అల్లరి చేష్టలు
బనశంకరి: వేలాదిమంది సంచరించే బెంగళూరు మెట్రో రైళ్లలో పోకిరీలు, కొందరు విద్యావంతులు కూడా రహస్యంగా మహిళా ప్రయాణికులను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం పెరిగిపోయింది. అల్లరిమూకలు మెట్రోస్టేషన్లు, రైళ్లలో సంచరిస్తూ యువతులు, మహిళల అసంబద్ధ ఫోటోలు, వీడియోలను క్లిక్ చేయడంతో పాటు అశ్లీల క్యాప్షన్ పెట్టి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసినట్లు కనబడింది. 5 వేలమందికి పైగా ఫాలోయర్స్ కలిగిన మెట్రో చిక్స్ అనే అకౌంట్‌లో ఏప్రిల్ 11 నుంచి వీడియో, ఫోటోలను అప్‌లోడ్ చేశారు. గమనించిన బనశంకరి పోలీసులు స్వయంప్రేరితంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
సూట్‌కేసులో బాలిక శవం
● నగర శివార్లలో ఘోరం
బనశంకరి: బాలికను హత్యచేసి తల–మొండెం వేరు చేసి సూట్‌కేసులో కుక్కి పడేశారు. ఈ భయానక సంఘటన బుధవారం ఆనేకల్ వద్ద చందాపుర రైల్వేపట్టాలపై కనపడింది. వెంటనే సూర్యనగర పోలీసులు, బయప్పనహళ్లి రైల్వే పోలీసులు చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన బాలిక వయసు 9, 10 సంవత్సరాలు ఉంటుంది. స్థానికులు సూట్‌కేసును చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎవరో ప్రయాణికులు పడేసుకుని ఉంటారని పరిశీలించారు. అందులో ముక్కలైన బాలిక శవాన్ని చూసి అందరూ హడలిపోయారు. ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానాలున్నాయి. పోలీసులు విచారణ చేపట్టారు.
ఫ్యాక్టరీ సంపులో
ఇద్దరు కార్మికుల మృతి
తుమకూరు: కర్మాగారంలోని సంపును శుభ్రం చేయడానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు కార్మికులు ఊపిరాడక మరణించారు. ఈ దుర్ఘటన స్థానిక వసంతనరసాపుర పారిశ్రామికవాడలో బుధవారం జరిగింది. ప్రతాప్ (23), వెంకటేష్ (32), మంజణ్ణ (42), యువరాజ్(32) కర్మాగారంలోని లక్ష లీటర్ల సామర్థ్యమున్న సంపులోకి దిగి శుభ్రం చేస్తుండగా రసాయనాల తాకిడికి ఊపిరి ఆడక పడిపోయారు. మిగతా కార్మికులు చూసి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ప్రతాప్, వెంకటేష్ మరణించారు. మిగతా ఇద్దరు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. బాధితులందరూ జిల్లావాసులే. కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితుల బంధువులు ధర్నాచేశారు. కోరా పోలీసులు కేసు నమోదు చేశారు.
రమణీయం.. రోకలి కరగ


