జూన్ నుంచి ఆన్‌లైన్‌లో రెవెన్యూ పత్రాలు
బళ్లారి రూరల్ : జూన్ నుంచి పాత రెవెన్యూ పత్రాలు ఆన్‌లైన్‌లో లభ్యం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకొన్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ భైరేగౌడ తెలిపారు. బుధవారం దావణగెరె జిల్లాధికారి కార్యాలయ సభామందిరంలో ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక భూ చట్టాన్ని అన్వయిస్తూ జనవసతి ప్రదేశాల్లో నివాసం ఉన్న వారసుదారులకు పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. దావణగెరె జిల్లాలో 1836 పట్టాలు ఆమోదం పొందగా, అందులో 1784 ఇ–పరిశీలనకు పంపినట్లు తెలిపారు. జిల్లాలో 193 లంబాణి తండాలను రెవిన్యూ గ్రామ పరిధిలోకి తీసుకోవడానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలిపారు. ఇందులో 156 తండాలు అనర్హత పొందినట్లు తెలిపారు. 10 నుంచి 49 ఇళ్లను ప్రత్యేక గ్రామాలుగా పరిగణించడానికి అవకాశం ఉందన్నారు. రెవెన్యూ పత్రాల కోసం దరఖాస్తు చేసుకొన్న అర్జీదారులకు ఆన్‌లైన్‌లోనే పొందేలా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ఉద్యానవన, గనులు భూవిజ్ఞాన శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున్, దుడా అధ్యక్షుడు దినేశ్ కె.శెట్టి, జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి, అదనపు జిల్లాధికారి పీ.ఎన్.లోకేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
త్వరలో గ్రామ రెవెన్యూ పత్రాల
పంపిణీ చేపడతాం
దావణగెరె జిల్లాలో 1836
పట్టాపత్రాలు ఆమోదం
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
కృష్ణభైరేగౌడ వెల్లడి


