
విహారయాత్రలో ఘోరం ●
● నదిలో మునిగి నలుగురు మృతి
యశవంతపుర: బట్టలు ఉతకడానికి వెళ్లిన నలుగురు నదిపాలైన ఘటన కర్ణాటక – మహారాష్ట్ర సరిహాద్దులోని కొల్హాపుర జిల్లా కాగల్ తాలూకా బస్తవాడె గ్రామంలో జరిగింది. మహరాష్ట్ర ముర్కడ్ గ్రామానికి చెందిన జితేంద్ర విలాస్ లోక్త (36), రుక్ది గ్రామానికి చెందిన సవితా అమర్ కాంబళె (27), బెళగావి జిల్లా అథణికి చెందిన రేష్మా దిలీప్ (34), యశ్ దిలీప్ (17)లు మృతి చెందారు. వీరందరూ రెండు కుటుంబాలకు చెందినవారు. వీరు నలుగురు కలిసి విహారం కోసం వేదగంగా నదికి వెళ్లారు. శుక్రవారం అనూరు గ్రామంలోని అతిథి గృహంలో నిద్రించారు.
శనివారం ఉదయం బట్టలు ఉతుక్కోవడానికి నది తీరానికి వెళ్లినప్పుడు ఇద్దరు జారి నీటిలోకి పడిపోయారు. వారిని కాపాడబోయి మరో ఇద్దరూ నదిలోకి పడిపోయారు. సమీపంలో ఎవరూ లేకపోవడంతో కాపాడేవారే కరువయ్యారు. కాగల్‌పురి పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. మృతదేహాలను అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్గం నిర్వహించి బంధువులకు అప్పగించారు.