కరెంట్‌ కోత.. నీటి కొరత! | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కోత.. నీటి కొరత!

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

పడిపోతున్న భూగర్భ జలాలు పంట చేతికొచ్చే వేళ అసలు పరీక్ష

13 ఎకరాల పంట ఎండుతోంది

అడుగంటిన జలాలు... అన్నదాత కన్నీరు

పొట్టకొచ్చిన వరికి నీటితిప్పలు.. ఎండుతున్న పైర్లు

ప్రాజెక్టుల్లో తగ్గిన నీటిమట్టం యాసంగి సాగుపై ఆందోళన

ప్రత్యామ్నాయ మార్గాలో రైతుల భగీరథ ప్రయత్నం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

వానాకాలం పంట అన్నదాతను అగాధంలో నెట్టేస్తోంది. వరి పొట్టకొచ్చే దశలో నెర్రలుబారిన పొలాలు రైతుకంట కన్నీరు తెప్పిస్తున్నాయి. పొలంలో పచ్చగా కనిపించాల్సిన వరి నీటికోసం ఎదురుచూస్తోంది. మరోవైపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బోర్లలో నీరు తగ్గిపోవడం, వాగులు ఎండిపోవడంతో చివరి దశలో పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కొందరు జనరేటర్లు అద్దెకు తెచ్చుకుంటుండగా.. మరికొందరు వాగుల్లో, బావుల్లో నీరు లేక ఎండుతున్న పొలాల ను చూస్తూ కన్నీరు పెడుతున్నారు. పెట్టుబడి అయినా వస్తుందో రాదో అని రంది పడుతుండగా.. సమయానికి నీరు అందకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. దీంతో అప్పులు చేసి అయినా పంటను కాపాడుకునేందుకు రైతులు కష్టపడుతున్నారు. మరో వైపు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు గతేడాదితో పోలిస్తే మరింత లోతుకు పడిపోవడం వచ్చే యాసంగి సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది.

జగిత్యాల జిల్లాలో గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలమట్టం 2.33 మీటర్లుగా ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 3.65 మీటర్లకు చేరింది. కరీంనగర్‌ జిల్లాలో 3.86 మీటర్ల నుంచి 4.28 మీటర్లకు పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5.09 మీటర్ల నుంచి 7.36 మీటర్లకు చేరగా, పెద్దపల్లి జిల్లాలో 3.52 మీటర్ల నుంచి 4.54 మీటర్లకు పెరిగింది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతేడాదితో పోలిస్తే 2.27 మీటర్ల మేర నీటిమట్టం దిగువకు వెళ్లడం గమనార్హం. బోర్లు, బావులపై ఆధారపడి సాగు చేసే రైతులకు ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

వరి పొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు నీటి లభ్యత కీలకం. ఈ సమయంలో నీరు అందకపోతే దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే సాగు ఖర్చులు పెరగడంతోపాటు, విద్యుత్‌ సమస్యలు, వాగుల్లో నీటి కొరత రైతులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. భూగర్భ జలమట్టాలు లోతుకు పడిపోతున్న నేపథ్యంలో బోర్లపై ఆధారపడే రైతులకు భవిష్యత్తులోనూ నీటి లభ్యత సవాలుగా మారింది. చి‘వరి’ దశలో రైతులు నీటి కోసం అల్లాడకుండా సంబంధితశాఖలు పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉంది.

మాది కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఘన్మక్కుల. నాకున్న 13 ఎకరాల్లో వరిసాగు చేశాను. తొలినాళ్లలో ఏపుగా పెరిగిన పైరు ప్రస్తుతం కోతదశకు చేరుకునే సమయంలో నీటి తడులు అందక ఎండిపోతోంది. పంట చేతికొచ్చే కీలక సమయంలో నీటి కొరత ఏర్పడటంతో దిగుబడి తగ్గి, పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చేలా లేవు. పంట చివరిదశలో నీరందక దెబ్బతింటే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుంది.

– కట్కూరి మధుసూదన్‌రెడ్డి, వీణవంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement