సారూ.. ‘దారి’ చూపండి | - | Sakshi
Sakshi News home page

సారూ.. ‘దారి’ చూపండి

Oct 16 2026 7:29 AM | Updated on Oct 16 2026 7:29 AM

ఉధృతమవుతున్న నేషనల్‌ హైవే–563 ఉద్యమం

సర్వీస్‌ రోడ్డు కావాలంటున్న ఈదులగట్టెపల్లి వాసులు

ఖాదర్‌గూడెం, శంశాబాద్‌, కొత్తగట్టులో అండర్‌పాస్‌ కోసం నిరసనలు

బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌

ఈదులగట్టెపల్లి వద్ద సర్వీస్‌రోడ్డు కోసం ధర్నా (ఫైల్‌)

కొత్తగట్టులో అండర్‌పాస్‌ కోసం దీక్ష (ఫైల్‌)

మానకొండూర్‌: ‘ఊర్లో నుంచి జాతీయ రహదారి పడుతుందంటే బంగారం పండే భూములు ఇచ్చాం. రోడ్డు వెడల్పు అయితే మా గ్రామం బాగుపడుద్దని ఆశపడ్డాం. జాతీయ రహదారిపై పక్కన ఇండ్లు ఉంటే రూ.లక్షల ఆస్తి ఉన్నట్లేనని సంబరపడ్డాం. రోడ్డు పనులు పూర్తయ్యాక మా ఊరికి పోయేందుకే దారి లేకుండా పోయింది. ఇదేక్కడి అన్యాయం అంటే పట్టించుకునే వారే కరువయ్యారు.. సారూ.. దారి చూపండి’.. అంటూ జాతీయ రహదారి– 563 పరిధిలోని పలు గ్రామాల ప్రజలు కొద్దిరోజులుగా ఆందోళనకు దిగుతున్నారు. కరీంనగర్‌ మండలం ఇరుకుల్ల నుంచి ప్రారంభమయ్యే కరీంనగర్‌– వరంగల్‌ ఫోర్‌ వే విషయంలో అడుగడుగునా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సర్వీస్‌ రోడ్డు వేయాలని మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లి వాసులు, అండర్‌పాస్‌ నిర్మించాలని ఖాదర్‌గూడెం, శంశాబాద్‌, శంకరపట్నం మండలం కొత్తగట్టు వాసులు రోజుకో రకమైన పోరాటాలు చేస్తున్నారు. వీరికి బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు తెలుపుతుండగా.. దారి ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నారు.

మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లి గ్రామస్తులు తమ ఊరికి వెళ్లేందుకు సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని మొదటినుంచి పట్టు పడుతున్నారు. ఇటీవల నేషన్‌హైవే అధికారులు, కలెక్టర్‌ ఇతర అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులు తరచూ రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఈనెల 14న కరీంనగర్‌– వరంగల్‌ హైవేపై రాస్తారోకో చేపట్టారు. గతంలో కలెక్టరేట్‌ ముట్టడి చేశారు. తమ గ్రామానికి దారి చూపే వరకు పోరాటం ఆగదని చెబుతున్నారు.

హైవేతో గ్రామం రెండుగా చీలిపోయిందని, వ్యవసాయ భూములు, పాఠశాలకు, శ్మశానవాటికకు, చివరికి కరీంనగర్‌ వెళ్లాలన్నా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఖాదర్‌గూడెం, శంశాబాద్‌ వాసులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. మూ డు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుందని, అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని జిల్లా, జాతీయ రహదారి అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.

జాతీయ రహదారితో శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాలు రెండుగా చీలిపోయాయి. ఇక్కడ అండర్‌పాస్‌ చేపట్టకపోవడంతో ఇప్పటికే నలుగురు రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. 15రోజులకు పైగా కొత్తగట్టు టోల్‌గేట్‌ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అర్ధనగ్న ప్రదర్శన, వంటావార్పు చేపట్టారు. నిరవదిక దీక్ష చేపట్టి, అధికారులకు తమ బాధ వెళ్లబోసుకున్నారు. అయినా ఎవరూ పట్టించు కోలేదు. ఇటీవల అధికారులు ఆందోళనకారుల టెంట్లు తొలగించగా.. అండర్‌పాస్‌ నిర్మించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement