కమలానికే కో ఆప్షన్‌! | - | Sakshi
Sakshi News home page

కమలానికే కో ఆప్షన్‌!

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

కో ఆప్షన్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపు విజేతలను అభినందించిన ‘బండి’ ఎన్నికలకు దూరంగా కాంగ్రెస్‌ గులాబీ పార్టీలో గందరగోళం డీసెంట్‌ నోటీసిచ్చిన రవీందర్‌సింగ్‌ నలుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల క్రాస్‌ఓటింగ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కో ఆప్షన్‌ స్థానాలు ఊహించినట్లుగానే కమలం ఖాతాలోకి చేరాయి. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఐదుగురు ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నారు. అవసరం పడనప్పటికీ అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు నలుగురు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. మరో వైపు ఈ ఎన్నిక నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందంటూ అదే పార్టీకి చెందిన సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌ డీసెంట్‌ నోటీసు ఇచ్చారు. విజేతలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అభినందించారు. కో ఆప్షన్‌ ఎన్నికల్లో గెలుపు తరువాత బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

ఏకపక్ష విజయం

ఐదు కో ఆప్షన్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికా ర బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నగరపాలకసంస్థ కౌన్సిల్‌ హాల్‌లో నిర్వహించారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటి మేయర్‌ యాదగిరి సునీల్‌రావు సహా 34 మంది బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. 69 మంది సభ్యులకు గాను కోరం ఉండాలంటే 35 మంది హాజరుకావా ల్సి ఉంటుంది. ఎక్స్‌అఫిషియో సభ్యుడి హోదాలో ఓటు హక్కు కలిగిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ నగరంలో ఉన్నప్పటికీ రాలేదు. కోరం కావాలంటే మరో సభ్యుడు అవసరం ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకావడంతో ఎన్నికకు మార్గం సుగమమైంది. ముందుగా జనరల్‌ కేటగిరీలోని మూడు స్థానాలకు పోటీపడ్డ 27 మంది పేర్లు చదవగా, బీజేపీకి చెందిన కన్న కృష్ణ, చిగిరి వెంకటమ్మలకు 34 మంది బీజేపీ, ఇద్దరు బీఆర్‌ఎస్‌ సభ్యులు చేతులెత్తారు. ఎలగందుల నందకుమార్‌కు 34 మంది బీజేపీ, ముగ్గురు బీఆర్‌ఎస్‌ సభ్యులు చేతులెత్తారు. మైనార్టీ కోటాలోని రెండు స్థానాలకు 13 మంది పేర్లు చదవగా, బీజేపీ అభ్యర్థులైన హఫీజాబేగంకు 34 మంది బీజేపీతో పాటు, ఇద్దరు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు చేతులెత్తి ఓటు వేశారు. బల్బీర్‌సింగ్‌కు 37 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థులు కన్న కృష్ణ, ఎలగందుల నందకుమార్‌, చిగిరి వెంకటమ్మ, హఫీజాబేగం, బల్బీర్‌సింగ్‌లు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఢిల్లీలో సమావేశానికి వెళ్లగా, డిప్యూటీ కమిషనర్‌ వేణుమాధవ్‌ విజేతలకు ధ్రువపత్రాలు అందించారు. మేయర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. విజేతలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అభినందించి, శాలువాలతో సత్కరించారు.

డీసెంట్‌ నోటీసు

మున్సిపల్‌ చట్టం, నిబంధనలు ఉల్లంఘించి కో ఆ ప్షన్‌ ఎన్నికను నిర్వహించారంటూ బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ రవీందర్‌ సింగ్‌ డీసెంట్‌ నోటీసు ఇచ్చారు. ఎంతమంది పోటీచేస్తున్నారనే విషయం కార్పొరేటర్లకు ముందుగా తెలపలేదని, జనరల్‌ బాడీలో ప్రాతినిథ్యం లేని మైనార్టీలనే ఎన్నుకోవాల్సి ఉండగా, ప్రాతినిథ్యం ఉన్న వాళ్లనే ఎన్నుకుంటున్నారని, ఇది నిబంధనలకు విరుద్దమంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికకు కాంగ్రెస్‌ దూరం

కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఎన్నికకు దూరంగా ఉన్నా రు. శనివారం ఉదయం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సమావేశమైన 18 మంది కార్పొరేటర్లు, ఎన్నిక ప్రక్రియలో పాల్గొనరాదని నిర్ణయించారు.

బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల క్రాస్‌ ఓటింగ్‌

కో ఆప్షన్‌ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌లో నెలకొన్న సమన్వయలోపం మరోసారి బయటపడింది. అవసరం లేనప్పటికి నలుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు బీజేపీకి ఓటు వేయడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కో ఆప్షన్‌ పదవులకు బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్లు పలువురు దరఖాస్తు చేసుకొన్నప్పటికి పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ఐదుగురు మరోసారి దరఖాస్తు చేశారు. మిగతావాళ్లు ఆ దరఖాస్తు కూడా ఇవ్వలేదు. సాంకేతికంగా వీరంతా పోటీలో ఉన్నట్లు అధికారులు పేర్లు చదివినప్పటికి, సభలోనే ఉన్న బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఎవరూ వీరికి ఒక్క ఓటు వేయలేదు. పైగా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, సుదగోని మాధవి, ఎస్‌.కె.యూసుఫ్‌, సమీనా పర్వీన్‌ బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయడం రాజకీయంగా కలకలం సృష్టించింది. సమావేశానికి కాంగ్రెస్‌ కార్పొరేటర్లు 18 మంది మినహా బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కార్పొరేటర్లు 48 మంది హాజరయ్యారు. 42 మంది మాత్రమే హాజరు పట్టికలో సంతకాలు చేయడంతో అధికారులు వారినే పరిగణలోకి తీసుకున్నారు. ఈ లెక్కన 22 మంది ఓట్లు వేస్తే మెజార్టీ సరిపోతుంది. బీజేపీ సభ్యులు 34 మంది ఓటు వేసినా, ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. కాని బీజేపీ కార్పొరేటర్లకు తోడుగా, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు నలుగురు ఓటు వేయడం దేనికి సంకేతం అనే చర్చ బల్దియా రాజకీయాల్లో మొదలైంది. ఇదిలాఉంటే అసలు ఎన్నికనే నిబంధనలకు విరుద్దంగా జరుగుతుందంటూ, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌ ఇచ్చిన డీసెంట్‌ నోటీసుపై పది మంది కార్పొరేటర్లు సంతకం చేయగా, అందులోనుంచి నలుగురు మళ్లీ బీజేపీకి ఓటు వేయడం గమనార్హం.

పట్టు సాధించాం: మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కో ఆప్షన్‌ ఎ న్నికల్లోనూ బీజేపీ పట్టు సాధించిందని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నిక అనంతరం నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. బండి సంజయ్‌ నేతృత్వంలో ఈ విజయాలు సొంతమయ్యాయన్నారు. కో ఆప్షన్‌ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement